Adi Parashakti: హిందూ మతంలో 33 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. నీటిని గంగమ్మ తల్లి, ఆహారాన్ని అన్నపూర్ణ దేవి అని , చదువుల తల్లిని సరస్వతి అని , లక్ష్మీదేవిని ధనదేవత అని ఇలా ఒక్కో దేవతకు ఒక్కో పురాణం ఉంది. వీరందరూ శక్తివంతమైన దేవతలు మాత్రమే కాదు.. అద్భుత శక్తులు, ఎన్నో మహిమలు కలిగిన వాళ్ళు. వీళ్లంతా లోక రక్షణ, దుష్ట శిక్షణ కోసం వివిధ అవతారాలలో భూలోకానికి విచ్చేశారు. అయితే హిందూ మతంలో ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవతగా పేరొందింది. ఈ తల్లినే ఆది పరాశక్తి అని కూడా అంటారు. హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసులను, దుష్టశక్తులను అంతం చేయడంలో పురుష దేవుళ్లు విఫలమైనప్పుడు రాక్షసులను మట్టుబెట్టేందుకు దుర్గాదేవి జన్మించింది. భయంకరమైన సింహం మీద స్వారీ చేసే ఈ అమ్మవారికి అందరి కంటే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈమె ధైర్యం, శక్తికి ప్రతీక. చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని, 8 చేతులు కలిగి ఉంటుంది. 8 చేతుల్లో 8 ఆయుధాలను ధరించి ఉగ్రరూపం దాల్చుతుంది. దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో అదృష్టం, ధైర్యాన్ని పొందవచ్చు. అద్భుత శక్తులను పొందడానికి చాలా మంది దుర్గాదేవిని పూజిస్తారు.
Also Read: Amitabh Bachchan : 50వేల మంది రియల్ ఆడియన్స్ మధ్యలో సాంగ్ షూట్ చేసిన అమితాబ్ బచ్చన్..