. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సర్వం సిద్ధం
. జనవరి 28న తొలి ఘట్టం..దేవతల ఆహ్వానం
. సమ్మక్క రాకతో పరాకాష్టకు భక్తి ..వనప్రవేశంతో ముగింపు
Medaram Sammakka-Saralamma jatara: జనవరి నెలాఖరులో మేడారం గిరిజన అరణ్యం మరోసారి భక్తిశ్రద్ధలతో ఉప్పొంగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారికంగా జాతర ప్రారంభానికి ముందే లక్షలాది భక్తులు మేడారానికి తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటుండటం విశేషం. గిరిజన సంప్రదాయాలు, ఆచారాల నడుమ జరిగే ఈ జాతరను దర్శించుకోవడం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు.
జాతరలో తొలి ప్రధాన ఘట్టం జనవరి 28 బుధవారం జరుగనుంది. ఈ రోజున కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన పూజారి కక్కె సారయ్య అమ్మవారిని ప్రతినిధించే పసుపు, కుంకుమ భరిణిని తీసుకుని కాలినడకన మేడారం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ యాత్ర జంపన్నవాగు మీదుగా సమ్మక్క గుడికి చేరుకుంటుంది. అక్కడ సమ్మక్క–పగిడిద్దరాజుల పెండ్లి తంతును సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. అనంతరం సాలమ్మను గద్దెపై కొలువుతీరుస్తారు. అదే రోజున పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి గోవిందరాజును మేడారంలోని గద్దెలపైకి చేర్చడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.
జనవరి 29 గురువారం సాయంత్రం జాతరలో అత్యంత కీలక ఘట్టం జరుగుతుంది. చిలకలగుట్ట అరణ్యం నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు వనం నుంచి జనసంద్రంలోకి తీసుకొస్తారు. ఈ సమయంలో ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాలిలో మూడు రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాకకు సంకేతం ఇస్తారు. శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలు, లక్షలాది భక్తుల జేజేలు మధ్య సమ్మక్క గద్దెపై కొలువుతీరుతుంది. ఈ మహాఘట్టం ఐదు నుంచి ఆరు గంటలపాటు కొనసాగుతుంది. మూడో రోజు భక్తులు గద్దెలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. నాలుగో రోజు జనవరి 31 శనివారం మధ్యాహ్నం దేవతలు తిరిగి వనంలోకి ప్రవేశించడంతో జాతర ఘనంగా ముగుస్తుంది. ఆధ్యాత్మికత, సంప్రదాయం, భక్తి భావాల సమ్మేళనంగా నిలిచే మేడారం జాతర మరోసారి భక్తుల మనసులను ఆకట్టుకోనుంది.
