. అంగరంగ వైభవంగా మేడారం జాతర ఏర్పాట్లు
. భక్తుల రాకకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు
. డోర్ డెలివరీగా అమ్మవారి బంగారం ప్రసాదం
Medaram Prasadam: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ వేడుకకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. మేడారం ఆలయాన్ని కనివినీ ఎరుగని రీతిలో సౌకర్యవంతంగా మార్చడంతో పాటు ఒకేసారి పదివేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లు, భద్రత, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ ఏడాది కోటిన్నరకు పైగా భక్తులు జాతరకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారం జాతరకు తరలివచ్చేందుకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. అయితే ఈ ఏడాది టీజీఎస్‌ఆర్టీసీ మరో అడుగు ముందుకు వేసింది. నాలుగు రోజులపాటు మాత్రమే జరిగే ఈ జాతరకు అనివార్య కారణాల వల్ల వెళ్లలేని భక్తుల కోసం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మేడారం అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. దీంతో జాతరకు హాజరు కాలేకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందే అవకాశం కల్పించింది.
ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరలో అమ్మవారికి బంగారం ప్రసాదం సమర్పించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ములుగు జిల్లా మేడారంలో జరిగే ఈ జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు బంగారం ప్రసాదం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో బంగారం ప్రసాదానికి కూడా అంతే పవిత్రత ఉందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ దేవాదాయశాఖ సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఫోటోతో పాటు బెల్లం, పసుపు, కుంకుమ కలిగిన బంగారం ప్రసాదం ప్యాకెట్లను డోర్ డెలివరీగా అందించనుంది.
ఈ ప్రత్యేక ప్రసాదం ప్యాకెట్‌ను కేవలం రూ.299 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం www.tgsrtclogistics.co.in
వెబ్‌సైట్‌లో లాగిన్ కావచ్చు లేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440069, 040-23450033 కాల్ సెంటర్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ వినూత్న సేవలతో భక్తులు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల అనుగ్రహాన్ని ఇంటి వద్దనే ప్రసాదంగా పొందే అవకాశం లభించింది.
