Site icon HashtagU Telugu

Satyanarayan Puja: సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం!

Satyanarayan Puja Imresizer

Satyanarayan Puja Imresizer

మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.

ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.

1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.

ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.

౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.
ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.

4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.

5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.

కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం.

1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.

2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.

3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.

4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.

5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది.
ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.

Exit mobile version