సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇంటి ముంగిట ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, కొత్త అల్లుడు, కోడి పందాలు మాత్రమే కాదు నువ్వుల నూనెతో చేసే స్నానం, నువ్వులతో చేసే పిండి వంటలు ఇలా ఎన్నో గుర్తుకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నువ్వుల నూనెతో తల స్నానం చేస్తూ ఉంటారు. అంతేకాదు అభ్యంగ స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను ముందుగా శరీరానికి రాసి నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తారు.
సంక్రాంతి రోజున తెల్లవారు జామునే అభ్యంగ స్నానం చేసే ముందు నుదుటిన కుంకుమ పెట్టుకుని నువ్వుల నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసి ఆ నూనెను శరీరం అంతా మర్ధన చేసుకుంటారు. అనంతరం సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని కుంకుడు రసంతో తలకు స్నానం చేస్తారు. అనంతరం కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. కాగా హిందూ పురాణాల ప్రకారం నువ్వులు యమ ధర్మరాజుకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు. కొన్ని పురాణాల ప్రకారం విష్ణువు స్వేద బిందువులే నువ్వులుగా మారాయని ఇవి అమరత్వపు విత్తనాలకు సూచన అని చెబుతారు.
రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత వసంతకాలం మొదలవుతుంది. ఇక నుంచి పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల శరీరం వాతావరణంలో చోటు చేసుకునే మార్పులకు రెడీ అవుతుంది. మకర సంక్రాంతి పండగ రోజున స్నానం చేసే మందు నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవడం వలన ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు నలుగు పిండితో శరీరం రుద్దుకోవడం వలన శరీరం శుభ్రపడుతుంది. అలాగే సంక్రాంతి రోజు నువ్వులు దానం చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. కనుక ఈ రోజున నువ్వులను బ్రహ్మణులకు లేదా పేదవారికి దానం చేయడం శుభాలను చేకూరుస్తుందని నమ్మకం.