Mahashakti Homam in Tirumala : తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ఆలయంలో మహాశాంతి యాగాన్ని చేపట్టారు. ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన ఈ హోమం 10 గంటల వరకు జరిగింది. అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు. విమాన ప్రాకారం దగ్గర ఏర్పాటు చేసిన మూడు హోమ గుండాలలో ఈ మహా క్రతువు జరుగుతోంది. యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. సమస్త దోష పరిహారం కోసం ఈ యాగం చేపట్టారు.
శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండటం వల్ల అపచారం కలిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతిహోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమం తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని వెల్లడించారు. లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నెయ్యి స్వచ్ఛతను తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందని పేర్కొన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఈరోజు శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటె..తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Read Also : Chiru-Pawan : అక్కడ తమ్ముడు..ఇక్కడ అన్నయ్య..రికార్డ్స్ తిరగ రాస్తున్నారు