హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివ రాత్రి పండుగ ఒకటి. ఈ పండుగ అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. జాగారం చేయడం, ఉపవాసం చేయడం, ప్రత్యేకమైన పూజలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈరోజున కొన్ని రకాల పనులు తప్పకుండా చేయాలట. ఇంతకీ ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉపవాసంతోనూ, జాగరణతోనూ, రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని జరుపుకుంటాము. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భం శివరాత్రి అని చెబుతారు.
ఈరోజున ఒంటిపూట భోజనం చేయాలనీ, మర్నాడు శివరాత్రి నాడు ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలని చెబుతున్నారు. ఇక శివరాత్రి రోజంతా ఉపవాసం చేయాలి. శివరాత్రి నాటి జాగరణతోనే ఆ ఉపవాసం పరిపూర్ణం అవుతుంది. జాగరణ అంటే కబుర్లతో కాలక్షేపం చేయడమో, సినిమాలు చూడటమో కాదంటున్నారు పెద్దలు. శివ నామస్మరణతో, శివ ధ్యానంతో మనసుని ఆయన యందు లయం చేయడమే జాగరణ లక్ష్యం అంటున్నారు. అలా చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయట. శివరాత్రి రోజు జాగ్రత్త మాత్రమే కాకుండా ఆయనకు రాత్రి సమయంలో అభిషేకం చేస్తే మరింత మంచి జరుగుతుందని చెబుతున్నారు. అభిషేక ప్రియుడైన శివునికి శివరాత్రి తొలి జాములో పాలతో అభిషేకించి పద్మాలతో పూజ చేయాలి.
ఇక రెండో జాములో పెరుగుతో అభిషేకించి తులసి దళాలతో పూజ. మూడో జాములో నేయితో అభిషేకించి మారేడు దళాలతో పూజ, నాలుగో జాములో తేనెతో అభిషేకించి నీలకమలాలతో పూజ సాగించాలి. ఇక ఒకో జాములోనూ ఒకో తీరులో ప్రసాదం (పులగం, పాయసం, నువ్వులు, అన్నం) సమర్పించాలి, ఇలా ఒక్కొక్క జాములో ఒకో వేదం నుంచీ మంత్రాలు చదవాలనీ చెబుతున్నారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా శివరాత్రినాడే కాబట్టి, ఈ రోజు శివాలయాలలో జరిగే పార్వతీ కళ్యాణాన్ని దర్శించడం కూడా విశేష ఫలితాన్ని అందిస్తుందట. ముఖ్యంగా ఈ శివరాత్రి నాడు చేసే పూజలు, పరిహారాలు ప్రత్యేక ఫలితాలను అందిస్తాయట.