Site icon HashtagU Telugu

Maha Shivaratri 2025: ఈ ఏడాది మహా శివరాత్రి ఎప్పుడు.. ఈ పండుగ ఎందుకంత ప్రత్యేకమో తెలుసా?

Maha Shivaratri 2025

Maha Shivaratri 2025

పరమేశ్వరుడిని కొన్ని విశేషమైన రోజుల్లో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన దినాల్లో పూజిస్తూ ఉంటారు. అయితే ప్రతి నెల మాస శివరాత్రి తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. ఏడాదికి 12 మాస శివరాత్రులు ఉంటే అందులో ఒక్కసారి మాత్రమే మహాశివరాత్రి వస్తుంది. ప్రతి ఏడాది ఈ మహాశివరాత్రి పండుగను హిందువులు ఎంతో భక్తితో జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజించి, ఉపవాసం ఉండి, జాగరణ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఏడాది అనగా 2025లో ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9 గంటల 48 నిముషాల వరకూ త్రయోదశి ఉంది. ఆ తర్వాత చతుర్థశి ఘడియలు ప్రారంభమయ్యాయి. మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8 గంటల 43 నిముషాల వరకూ మాత్రమే చతుర్థశి తిథి ఉంది. అంటే సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరి 27 శివరాత్రి జరుపుకోవాలి. కానీ లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ముఖ్యం కాబట్టి ఫిబ్రవరి 26 బుధవారమే శివరాత్రి. అయితే ఈ శివరాత్రి పండుగకు ఎందుకు అంత ప్రత్యేకం అన్న విషయానికి వస్తే.. ఏ పండుగ అయినా స్నానం, పూజ, కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లంతా సందడి ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, సంసార సుఖాలకు దూరంగా ఉంటు అనుక్షణం శివయ్య ధ్యానంలోనే రోజు గడుస్తుంది.

శంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భమే మహా శివరాత్రి. దీని వెనుకున్న పురాణ కథ కూడా ఉంది. ఇంతకీ ఆ కథ ఏమిటి అన్న విషయానికొస్తే.. బ్రహ్మ, శ్రీ మహా విష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అని వాదించుకోవడం మొదలు పెట్టారు. ఈ సమస్యని తీర్చాలంటూ శివుడిని ఆశ్రయించారు. అప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన శివుడు ఆది,అంతం కనుక్కోమని ఇద్దర్నీ పంపించాడు. విష్ణువు శివలింగం ఆది తెలుసుకునేందుకు వెళితే బ్రహ్మ అంతం తెలుసుకునేందుకు వెళ్లాడు. ఎంత కిందకు వెళ్లినా ఆది తెలియకపోవడం విష్ణువు తిరిగొచ్చేసి నిజం చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం అంతం కనుక్కోలేక ఓటమిని అంగీకరించలేక చూశానంటూ సాక్ష్యం చెప్పమని మార్గం మధ్యలో కనిపించిన మొగలి పువ్వు, గోవును సాక్ష్యం చెప్పమన్నాడు. ఆ విషయం తెలుసుకున్న శివుడు బ్రహ్మకు ఆలయాలు ఉండవని, మొగలి పూవు పూజకు పనికిరాదని, గోవు ముఖం చూస్తే పాపం అని శపించాడు. అందుకే బ్రహ్మ దేవుడికి ఆలయాలు లేవు, మొగలి పూవు పూజకు వినియోగించరు. గోవు ముఖం భాగాన్ని కాకుండా తోక భాగాన్ని పూజిస్తారు. ఈ సమయంలోనే ప్రాణకోటిని సృష్టించి రక్షించే బాధ్యత బ్రహ్మకు మోక్షాన్నిచ్చే బాధ్యత విష్ణువుకు అప్పగించాడు శివుడు. ఈ విషయాలన్నీ కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉన్నాయి.