హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి పండుగ కూడా ఒకటి. ఈ మహాశివరాత్రి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ప్రతి ఒక్క శివాలయం కూడా అందంగా దీపాలతో అలంకరిస్తారు. ఇకపోతే ఈ సారి శివరాత్రి మాఘమాసం కృష్ణ పక్షం చతుర్దశి రోజున ఫిబ్రవరి 26న వస్తుంది. శివరాత్రిని ముఖ్యంగా లింగోధ్బవ కాలంలో ఎక్కువగా పూజించుకుంటారు. అయితే ఈ సారి ఫిబ్రవరి 26న అర్ధరాత్రి లింగోధ్బవం సమయంను రాత్రి 12 గంటలకు పండితులు చెబుతున్నారు.
ఆ సమయంలో శివుడ్ని పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లతో అభిషేకం చేయాలని పండితులు సూచిస్తున్నారు. అదే విధంగా మహా శివరాత్రి రోజున తప్పుకుండా మూడు పనుల్ని మర్చిపోకుండా ఆచరించాలని పురోహితులు తరచుగా చెబుతుంటారు. మహా శివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 26న బ్రహ్మమూహూర్తంలో నిద్రలేవాలి. ఆ రోజున శుభ్రంగా తలస్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకొవాలి. తర్వాత సాంప్రదాయ దుస్తులు దరించి ఆలయంకు వెళ్లాలి. శివ లింగం ఉన్న ఆలయంకు వెళ్తే మంచిది. ముఖ్యంగా పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనెలను తమతో తప్పకుండా తీసుకొని వెళ్లాలి.
అదే విధంగా బిల్వ పత్రాలను కూడా తీసుకెళ్లాలి. శివుడికి పండితుడితో రుద్రం చెప్పించుకుని అభిషేకం చేయాలి. అంతేకాకుండా బిల్వపత్రంను తప్పనిసరిగా శివుడికి అర్పించాలి. ఆ తర్వాత గంధం పెట్టి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజలు చేయాలి. శివుడికి ఖర్జురాలు, కొబ్బరికాయ, చక్కెర మొదలైనవి నైవేద్యంగా పెట్టాలని చెబుతున్నారు. ఆ రోజున ఉపవాసం ఉంటే.. ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతుంటారు. అదే విధంగా రాత్రి పూట జాగరణ చేస్తే వారికి కల్గే పుణ్యం వల్ల ధనానికి అస్సలు కొదువ ఉండదని పండితులు చెబుతున్నారు.