prayagraj : మహా కుంభమేళా సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో గల గంగా, యుమన, సరస్వతి నదీ సంగమం వద్ద భక్తులు పుణ్యస్నానాలకు పోటెత్తారు. పుష్య పౌర్ణమికి ప్రారంభమయ్యే మహా కుంభమేళా మహా శివరాత్రి పర్వదినంతో పరిసమాప్తం కానుంది. సోమవారం తెల్లవారుజామున్నే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉదయాన్నే సుమారు 50 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా వేస్తున్నారు.
మహా కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా హిందువులు తరలివస్తారు. కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. మహా కుంభమేళాకు దాదాపు 850 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కాగా, పురాణాల ప్రకారం, సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్థన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
కుంభమేళా తేదీలను రాశులను బట్టి నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారాన్ని పరిశీలించి.. కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. సూర్యుడు, బృహస్పతి.. సింహరాశిలో ఉన్న సమయంలో నాసిక్‌లో కుంభమేళ జరుగుంది. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో.. గురుగ్రహం వృషభ రాశిలో, సూర్యుడు మకరంలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
ఇక, ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తుంటారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళా 2013లో జరిగింది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహా మేళా జరుగుతుంది. ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నది మహా కుంభమేళా. ఈ మహా కుంభమేళాను చూడడం అదృష్టమని.. ప్రతి మూడు తరాల్లో ఒక్కరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.
Read Also: KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్