ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు మహా కుంభమేళాకు వెళ్లి అక్కడ దర్శించి స్నానాలు చేస్తే మరికొందరు అక్కడికి వెళ్లలేక ఇంటిపట్టునే ఉంటారు. అటువంటివారు మహా కుంభమేళాకి వెళ్లలేకపోయామని బాధ పడుతూ ఉంటారు. కానీ అలా బాధ పడాల్సిన పనిలేదని, ఎందుకంటే కుంభమేళాకు వెళ్లలేని వారు కొన్ని నియమాలు పాటించి స్నానం చేయడం ద్వారా ఇంట్లోనే కుంభమేళా అమృత స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కుంభమేళా స్నానం ప్రయోజనాన్ని పొందడానికి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఎందుకు అంటే అమృత స్నానం అనేది బ్రహ్మ ముహూర్త సమయంలో జరుగుతుంది. దగ్గరలో పవిత్ర నది ఏదీ లేకపోతే ఇంట్లోనే ఉన్న నీటిలో కొంత గంగాజలం వేసి భక్తితో స్నానం చేయవచ్చట. అయితే స్నానం చేస్తున్నప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ. నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధి కురు అనే మంత్రాన్ని జపించాలట. ఈ మంత్రాన్ని జపించలేకపోతే “హర హర గంగే” అని అయినా జపించవచ్చట. ఈ విధంగా చేస్తే అమృత స్నానం చేసిన ఫలితం పుణ్యం దక్కుతుందని చెబుతున్నారు. అయితే ఈ స్నానం చేసేటప్పుడు సబ్బులు సోపులు, షాంపూలు వంటివి ఉపయోగించకూడదట.
కుంభమేళాలో సాధారణంగా 5 స్నానాలు చేసే సంప్రదాయం ఉంది. కాబట్టి మనస్సులో గంగామాతను స్మరించుకుంటూ ఇంట్లో స్నానం చేయవచ్చట. బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసిన తరువాత, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలట. తులసి మాతకు నీటిని సమర్పించాలని, మహాకుంభంలో విరాళానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే స్నానం చేసిన తర్వాత డబ్బు, బట్టలు, ఆహారం మొదలైన వాటిని పేదలకు, నిస్సహాయులకు దానం చేయాలని చెబుతున్నారు. ఇలా ఇంట్లో స్నానం చేసిన వారు ఆ రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి అసలు తినకూడదట.