హిందువులకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో మాఘమాసం కూడా ఒకటి. మాఘ మాసం నెలలో పరమేశ్వరుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈనెల మొత్తం మాఘ స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఇకపోతే ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో ఆ రోజున ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది. మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం… 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6:55 గంటలక పూర్ణిమ తిథి ముగింపు.. 12 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 గంటలకు,ఉదయం తిథి ప్రకారం, ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష, మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది. దీంతో పాటు శివ వాస యోగం కూడా ఉంటుంది. ఈ యోగం సమయంలో మహా కుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చెబుతున్నారు.. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలి. పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి.
మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహా విష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయడం మంచిది. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయట. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతున్నారు..