Brahmotsavam: 27 నుంచి తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 12:06 PM IST

ఈ ఏడాది తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ వల్ల గత రెండేళ్ళుగా నాలుగు మాడ వీధుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించలేక పోయారు. అందువల్ల ఈ సారి నాలుగు మాడ వీధుల్లో ఉండే ప్రతిభక్తుడికీ సంతృప్తి కరంగా వాహన సేవల దర్శన భాగ్యం కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నెల 27 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 6 – 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. 26 రాత్రి 7- 8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల మొదటి రోజు 27వ తేదీ సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. ధ్వజారోహణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు ఉంటాయి. గరుడ వాహనం రోజు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు నిర్వహిస్తారు. అక్టోబరు 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దాంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్‌ఆర్‌ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు వంటివాటిని రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.