Site icon HashtagU Telugu

Lemon Lamp: నిమ్మకాయతో దీపం పెడుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!

Lemon Lamp

Lemon Lamp

మామూలుగా మనం ఇంట్లో అలాగే దేవాలయాల్లో, పూజ చేసేటప్పుడు నిమ్మకాయ తొక్కతో దీపాలను వెలిగించడం మనందరం చూసే ఉంటాం. అయితే ఇలా నిమ్మకాయతో దీపం పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఆ విషయాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. నిమ్మకాయలు శక్తి స్వరూపిణి పార్వతీ దేవికి చాలా ఇష్టం. అందుకే ఈ దీపారాధనలో నిమ్మకాయలను ఉపయోగిస్తారు. గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, అందుకే మారెమ్మ, పెద్దమ్మ,మొదలైన శక్తి దేవి అవతారాలకు కూడా నిమ్మకాయలతో చేసిన దండలు సమర్పిస్తారు. ఈ నిమ్మకాయ దీపాలను గ్రామ దేవతల దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి.

మహాలక్ష్మి, సరస్వతి, ఇతర దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు. పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయ దీపాలను మంగళ, శుక్రవారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి. శుక్రవారం రోజు వెలిగించే దీపం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఎందుకంటే శుక్రవారం సత్వగుణానికి ప్రతీక. అయితే ఈ దీపాన్ని వినియోగించడం కోసం ఎల్లప్పుడూ తాజాగా ఉన్న నిమ్మకాయలను మాత్రమే తీసుకోవాలి. దీపం క్రింద తమలపాకు లేదా ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి, లోబాన్, సాంబ్రాణి పొగ దూపం వేయాలి. అలాగే పూజకు కేవలం ఎర్రని పూలను ఉపయోగించాలి.

తర్వాత బెల్లంతో తయారు చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మచ్చలు లేని, వాడిపోని, ఆకుపచ్చని రంగులో ఉన్న తాజా నిమ్మకాయలను మాత్రమే ఉపయోగించాలి. మహిళలు బహిష్ట సమయంలో మైలతో ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలను అస్సలు వెలిగించకూడదు. స్త్రీలు ఋతు సమయం ముగిసిన తర్వాత 4వ రోజు తల స్నానం చేసి, 5వ రోజు స్నానం చేసి దీపం వెలిగించాలి. పండుగ సమయం, పెద్దల తిధి కార్యాలు, పిల్లల పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభ సమయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు స్త్రీలు పట్టు చీర ధరించడం మంచిది. ముఖ్యంగా ఎరుపు లేదా పసుపు రంగు పట్టు చీరలు ఉత్తమం. పట్టు చీరలు లేకుంటే, శుభ్రమైన, మంచి చీరలు కట్టుకోవచ్చు. ఈ విధంగా నియమాలు పాటిస్తూ నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.