Site icon HashtagU Telugu

Krishna janmashtami 2024: ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు.. పండుగ విశిష్టత గురించి తెలుసా?

Sri Krishna Janmashtami

Sri Krishna Janmashtami

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ కూడా ఒకటి. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు. అంతేకాకుండా చిన్న పిల్లలకు కృష్ణుడి గోపికల వేసాలు వేసి వారిని చూసి మురిసిపోతూ ఉంటారు. సాక్షాత్తు ఆ చిన్నికృష్ణుడే ఇంటికి వచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు.

ఇకపోతే ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26, 2024 సోమవారం రోజు వచ్చింది. మరి ఈ రోజున శుభ ముహూర్తం విషయానికి వస్తే… అష్టమి తిథి ప్రారంభం – ఆగస్టు 26, 2024 ఉదయం 03:39 గంటల నుంచి, అష్టమి తిథి ముగింపు – ఆగస్టు 27, 2024 మధ్యాహ్నం 02:19 గంటలకు.. రోహిణి నక్షత్రం ప్రారంభం – ఆగస్టు 26, 2024 మధ్యాహ్నం 03:55 గంటల నుంచి.. రోహిణి నక్షత్రం – ఆగస్ట్ 27, 2024 మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది. చంద్రోదయ సమయం – 11:41 PM కాగా నిశిత పూజ సమయాలు – ఆగస్టు 27 అర్థరాత్రి 12:06 AM నుండి 12:51 AM, వ్యవధి – 00 గంటల 45 నిమిషాలు. మరి ఈ రోజున ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతం దీపం వెలిగించాలి.

సకల దేవతలకు జలాభిషేకం చేసి ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు. బాల గోపాలుడికి జలాభిషేకం చేయాలి. ఈ రోజు బాల గోపాలుడిని ఊయలలో కూర్చోబెట్టి ఊపుతారు. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కేవలం సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు రాత్రి పూజ చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రీ కృష్ణుడు రాత్రి జన్మించాడు. రాత్రి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి, డ్రై ఫ్రూట్స్‌ ను అందించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే కృష్ణాష్టమి ప్రాముఖ్యత విషయానికి వస్తే.. శ్రీ కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీకృష్ణుని ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయట. ఈ రోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందట. శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున, శ్రీకృష్ణుని బాల రూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాద ముద్రలు ఇంటి ముందర వేస్తారు. తమ పిల్లలకు బాలగోపాలుడిలా అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారట..