Site icon HashtagU Telugu

AP News: భక్తుల కొంగుబంగారం కోటప్పకొండ.. ఆలయ ప్రత్యేకతలు ఇవే

Kottappa

Kottappa

AP News: గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.

ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అనబడుతుంది. విష్ణువు శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరంనకు నైఋతి భాగంనున్న శిఖరంనకు బ్రహ్మశిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరంలపై స్వయంభువులగు జ్యోతిర్లింగంలు వెలయుటయు, ఈ శిఖరంపై ఏమియు లేకపోవుటయుకని చింతిల్లి, బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవింపజేసెను. ఇదియే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.

కోటప్పకొండ స్థలపురాణం పురాణ కథనాలను అనుసరించి దక్షాయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి, ప్రార్థించి తమకు జ్ఞానభోధ చెయ్యమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా, బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్పగుడి అను పేరు. లోపలి లింగం ఒక అడుగు ఎత్తు కలది.