దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంటిని మొత్తం దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. ఈ దీపావళి పండుగ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అలాగే రకరకాల నూనెలు ఉపయోగించి దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక దీపావళి రోజున ప్రదోష సమయంలో లక్ష్మి దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. దీపం జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద, ఆనందాలకు ప్రతీకాగా భావిస్తారు. దీపావళి రోజున దీపాలను ఆరాధిస్తూ లక్ష్మీదేవిని పూజించడం శుభ్రప్రదం అని హిందువుల నమ్మకం. దీపావళిలో దీప అంటే దీపం అని.. ఆవళి అంటే వరుస అని అర్ధం.
దీపావళి రోజున ఏ ఇంటి ముందు నువ్వుల నూనెతో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. దీపావళి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు దీపాలు వెలిగించాలి. ఈ దీపంలో సకల దేవతలు ఉంటారని వేదాలు ఉన్నాయని శాంతి కాంతికి గుర్తు దీపం అని నమ్మకం. అయితే దీపాలను వెలిగించడానికి అగ్గిపుల్లను నేరుగా ఉపయోగించకూడదట. మొదట ఒక దీపాన్ని ఒక అగరవత్తుతో వెలిగించి ఆ దీపంతో మరొక దీపాన్ని వెలిగించి దీపారాదన చేయాలని చెబుతున్నారు. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం ఐశ్వర్యం సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. ఆవు నెయ్యిలో నువ్వుల నూనె వేప నూనె కలిపి దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట.
దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి ఇల్లాలు స్వయంగా వెలిగించాలట. మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని చెప్తారు. వేప నూనె రెండు చుక్కలు, ఆవునెయ్యి కలిపిన దీపం పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు.
అయితే దీపావళి రోజున వెలిగించే దీపాలను ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్ఠం. అర్ధనారీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుందట. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. నూవ్వుల నూనె సకల దేవతలకు ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతో వెలిగించే దీపాలు కష్టాలను దూరం చేసి సకల శుభాలను అందిస్తాయని చెబుతున్నారు. దీపావళి రోజు దీపారాధన చేసేవారు వేరుశనగ నూనెను ఉపయోగించకపోవడమే మంచిదని చెబుతున్నారు.