Site icon HashtagU Telugu

Erukamamba Ammavaru: విశాఖపట్నంలో ఉన్న తల లేని అమ్మవారి విశిష్టత తెలుసుకోండి.

Know The Uniqueness Of Erukamamba Ammavaru In Visakhapatnam.

Know The Uniqueness Of Erukamamba Ammavaru In Visakhapatnam.

అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు.. ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే విశాఖ దొండపర్తిలో కొలువైన ఎరుకుమాంబ (Erukamamba) అమ్మవారు. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు.. అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈమె శిరస్సు కాళ్ళ వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెబుతారు. ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఈ ఎరుకమాంబ (Erukamamba) అమ్మవారును భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం.

ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ (Erukamamba) అమ్మవారు కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో.. తాను అక్కడే ఉంటానని కలలో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెబుతారు. దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే, ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరు పడిన అమ్మవారి శిరస్సు అతికించిన నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా.. శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖ వాసులు.

ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఎరుకుమాంబ అమ్మవారును వ్యవహరిస్తారు. బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తీరుతాయని విశ్వాసం. వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు, వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలు కల్యాణ యోగం పొందుతారు. భక్తులు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 P.M నుండి 5:30 P.M. వరకు స్నానఘట్టాలను ఘనంగా జరుపుకుంటారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే, ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఎరుకుమాంబ అమ్మవారును పూజిస్తారు.

ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి, ఎరుకుమాంబ అమ్మవారు ఆలయానికి ఎవరు వచ్చినా, వారి స్వంత మార్గంలో ఎరుకుమాంబ అమ్మవారును పూజించవచ్చని ధర్మకర్తలు నియమం పెట్టారు. విశాఖపట్నం నగరంలో దొండపర్తి ప్రాంతంలో ఈ ఆలయం కలదు.

Also Read:  Sai Baba: ఓ సాయి భక్తురాలి అనుభవాలు..