దీపావళి అమావాస్య తర్వాత కార్తీకమాసం మొదలు కానుంది. ఈ కార్తీకమాసాన్ని మహా విష్ణువుకు అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. ఎక్కువ శాతం మంది కార్తీక మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. శరత్ పూర్ణిమ ముగిసిన తరువాత ఈ కార్తీకమాసం మొదలవుతుంది. ఇకపోతే ఈ ఏడాది అనగా 2024 లో నవంబర్ 1న మొదలై నవంబర్ నెల ఆఖరికి ఈ కార్తీకమాసం పూర్తికానుంది. అయితే ఈ కార్తీక మాసం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది నదీ స్నానం.
ఈ కార్తీకమాసంలో ఉదయాన్నే ఐదు గంటల ప్రాంతంలో నిద్ర లేచి చల్లనీటితో స్నానం చేసి పరమేశ్వరుడిని అలాగే శ్రీమహా విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కాగా కార్తీక మాసంలో మహా విష్ణువు మత్స్య రూపంలో నీటిలో కొలువై ఉంటాడు. అందుకే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తారు. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తులు మోక్షాన్ని పొందుతారని, వారి పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్ముతారు. అయితే కార్తీక్ స్నానం చేయాలి అనుకున్న వారు సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి.
పవిత్రమైన నదిలో స్నానం ఆచరించడం మంచిది. లేదంటే ఏదైనా నీరు పారుదల ప్రాంతంలో స్నానం చేయడం మంచిది. అప్పుడే కార్తిక స్నానం ఫలితాలను పొందుతారు. కార్తిక స్నానం ఆచరించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల మీకు అదృష్టం పెరుగుతుందట. అయితే కార్తీక స్నానం చేసేవారు తమ శరీరానికి నూనె రాయకూడదని పండితులు చెబుతున్నారు. కార్తీక స్నానం చేసిన తర్వాత తులసిలో నీళ్లు పోసి పరిక్రమం చేయాలి. సాయంత్రం పూట తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. కార్తీకమాసంలో స్నానమాచరించి ఉపవాసం ఉండేవారు ఉల్లి, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. కార్తీక పౌర్ణమిని అనుసరించే వారు మాంసాహారం తినకూడదు. అలాగే మాంసం వంటి ఆహారాలను కూడా తినకూడదని పండితులు చెబుతున్నారు.