Site icon HashtagU Telugu

Copper Mug: పూజ గదిలో రాగి చెంబుతో నీళ్లు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీకు తెలుసా?

Mixcollage 13 Feb 2024 02 36 Pm 5431

Mixcollage 13 Feb 2024 02 36 Pm 5431

మామూలుగా చాలామంది ఇంట్లో పూజ గదిలో రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా ఎందుకు పెడతారు అన్న విషయం చాలా మందికి తెలియదు. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి పాత్ర నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతుంటారు. ప్రతి ఇంట్లోనూ పూజగదిలో పూజకు ముందు రాగి, వెండి పాత్రలలో నీటిని దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ పాత్రలోని నీటిలో నిక్షిప్తమై అది ఇంటికి మంచిది చేకూరుస్తుంది.

అందుకే పూజ అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీర్థాన్ని తీసుకుంటాం. పూజ చేసిన తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై అది ఆ కుటుంబానికి శుభాలను చేకూరుస్తుంది. ఇక పూజగదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది. నీరు దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం. అందుకే రాగిపాత్రలో నీటిని ఉంచడం వల్ల, ఆ నీటిలో దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు. కాబట్టి పూజగదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. అంతేకాదు పూజకు ముందు విగ్రహాలను శుభ్రం చెయ్యటానికి, అభిషేకం చేయడానికి, పూజ గదిని సంప్రోక్షణ చేయడానికి కూడా నీరు అవసరం. నీటితో పూజగదిని శుద్ధి చేసినప్పుడు దేవతలు సంతోషిస్తారు. అందుకే పూజ గదిలో కచ్చితంగా నీటి పాత్రను ఉంచుతారు.

నైవేద్యం నివేదించినప్పుడు, కర్పూర హారతి ఇచ్చినప్పుడు కూడా నీటితోనే స్వామికి నివేదన చేస్తారు. కాబట్టి పూజగదిలో నీటిని పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పూజ గదిలో నీటి విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి. పూజకు ఉపక్రమించే ముందు పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి, ఆపై రాగి చెంబును కొత్త నీటితో నింపి మాత్రమే పూజ చేయాలి. పాత నీటితోనే పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితమూ ఉండదు. పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది.

Exit mobile version