. చార్‌ధామ్ ఆలయాల్లో సంప్రదాయాల పరిరక్షణకు అడుగు
. హిందువులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన
. గంగోత్రిలో ఇప్పటికే అమలులో నిషేధం
Badrinath Temple: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలన్న కీలక ప్రతిపాదన ముందుకు వచ్చింది. చార్‌ధామ్ పరిధిలోకి వచ్చే ఈ ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ఆలోచన చేస్తోంది. సంప్రదాయాలు, ఆచారాలు, ఆలయ పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో జరగనున్న కేదార్‌నాథ్–బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది.
ఈ అంశంపై కేబీటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది స్పందించారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలతో పాటు కమిటీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాల్లోనూ ఇదే నిబంధనను అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. చార్‌ధామ్ యాత్ర అనేది కేవలం పర్యటన కాదు అది హిందువులకు సంబంధించిన అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణమని ఆయన పేర్కొన్నారు. ఆలయాల్లో జరిగే పూజా విధానాలు, ఆచారాలు శాస్త్రోక్తంగా కొనసాగాలంటే ప్రవేశ నియమాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు బోర్డు సభ్యుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదివరకే గంగోత్రిధామ్ ఆలయంలో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం అమలులోకి వచ్చింది. తాజాగా జరిగిన గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ నిర్ణయం తర్వాతే కేబీటీసీ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. బోర్డు సమావేశం అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ఒకవైపు సంప్రదాయాల పరిరక్షణకు ఇది అవసరమని కొందరు భావిస్తుండగా మరోవైపు దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా చార్‌ధామ్ ఆలయాల నిర్వహణలో ఇది ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
