Site icon HashtagU Telugu

TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం

Keerthana

Keerthana

TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన‌ విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది.

ఈ సంద‌ర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదైవము అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుండి గోవింద కోటిని రాయడం ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోవింద కోటిని భక్తిశ్రద్ధలతో రాసినట్లు తెలిపారు.

చిన్నతనం నుండి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయని, స్వామి అనుగ్రహంతోనే తాను తక్కువ సమయంలో 10 లక్షల మార్లు గోవింద కోటి రాయగలిగినట్లు చెప్పారు. గోవింద కోటి రాస్తున్న సమయంలో తాను సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.

విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని టిటిడి ప్రవేశపెట్టిన విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి మాత్రమే శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టిటిడి నిర్ణయించింది.

Exit mobile version