కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు పెట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజు పెడుతూ ఉంటారు. అలాగే దగ్గరలో ఉన్న ఆలయాలతో పాటు శ్రీమహావిష్ణువు ఆలయం పరమేశ్వరుడి ఆలయాలకు వెళ్లి 365 వత్తులతో కలిపి దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సంవత్సరంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజున దేవ్ దీపావళి, గురునానక్ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేసి తమ శక్తి మేరకు దానం చేస్తారు. పౌర్ణమి రోజున పూజ, క్రతువులు, దీపదానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రోజు సనాతన ధర్మంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.
ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 15 అనగా రేపు శుక్రవారం రోజు వచ్చింది. అయితే కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజున మీ ఇంటి ముందు నిలబడిన నిరుపేదలు లేదా పేదవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరాదు. ఈ రోజు పేదలతో, నిస్సహాయులతో, వృద్ధులతో అనుచితంగా ప్రవర్తించకూడదట. కార్తీక పౌర్ణమి రోజున ఎవరినీ నొప్పించకూడదు. ఈ రోజున ఎవరినైనా అవమానించడం వల్ల దేవుళ్ళకు కోపం వస్తుందట. పొరపాటున కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇతరులతో నిందా పూర్వకంగా మాట్లాడకూడదట. ఈ రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. మద్యం త్రాగకూడదట. కార్తీక పౌర్ణమిరోజు దానం చేయడం చాలా మంచిది, అయితే ఈ రోజున వెండి పాత్రలు, పాలు లేదా పాల ఉత్పత్తులను దానం చేయకూడదట.
వెండి పాత్రలు, పాలు దానం చేయడం వలన చంద్ర దోషం ఏర్పడవచ్చు. దీని కారణంగా వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందట. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో ఏ గదిలోనూ చీకటిగా ఉండకూడదట. అలాగే ఇంటిని మురికిగా కూడా ఉంచకూడదట. ఈ రోజు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున చీకటిగా అపరిశుభ్రంగా ఉండే ఇంట్లో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదట. ఆగ్రహించి ఇంటి ద్వారం వద్ద నుంచే తిరిగి వెళ్ళిపోతుందట. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, చేపలు వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదట. ఈ రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదట. ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.