కార్తీక మాసంలో అతి ముఖ్యమైన రోజులలో కార్తీక పౌర్ణమి రోజు కూడా ఒకటి. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తిక పౌర్ణమి పర్వదినం రోజు వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తిక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని, దానివల్ల కష్టాలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి అన్న విషయానికి వస్తే…
ఈరోజున ఉదయాన్నే లేచి సముద్ర స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల దృష్టి దోషం నర పీడా ఉంటే తొలగిపోతాయట. అలాగే కార్తీక పౌర్ణమిన రోజు దీప దానం కూడా చేయాలట. ఇంకా ఈ రోజు దేవాలయ ప్రాంగణంలో గానీ లేదా ఇంట్లో 365 వత్తులతో లేదా 720 వత్తులతో దీపం వెలిగించాలని చెబుతున్నారు. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట. అలాగే ఈ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తిక పౌర్ణమి రోజునే.
అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తిక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలట. ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలని చెబుతున్నారు. అందరూ కార్తిక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుందట. అదేవిధంగా తొందరగా గృహ యోగం కలగాలంటే కార్తిక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలంగా ఇవ్వాలట. ఇలా చేస్తే గృహ యోగం కలుగుతుందని చెబుతున్నారు.