Kartik Month: కార్తీకమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..?

కార్తీకమాసం (Kartik Month)లో మాంసాహారం తినకూడదు అన్న నియమం కూడా ఒకటి. దాదాపు నెల రోజులపాటు కార్తీకమాసంలో ఇంట్లో అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు.

  • Written By:
  • Updated On - November 21, 2023 / 08:36 AM IST

Kartik Month: హిందువులు ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అయితే వాటిని ఎందుకు పాటిస్తున్నారు వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే ఎవరికి తెలియదు. ఒకవేళ అడిగితే పెద్దలు పాటిస్తున్నారు అందుకే మేము కూడా పాటిస్తున్నాము అని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో కార్తీకమాసం (Kartik Month)లో మాంసాహారం తినకూడదు అన్న నియమం కూడా ఒకటి. దాదాపు నెల రోజులపాటు కార్తీకమాసంలో ఇంట్లో అలాగే గుళ్ళు గోపురాలు తిరుగుతూ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మాసం మొత్తం శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఇకపోతే కార్తీక మాసంలో ఆహారం ఎందుకు తినకూడదు ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పురాణాల ప్రకారం.. ఒక జంతువుని చంపేవాడు ,చంపటానికి సిద్ధపడేవాడు, చంపమని చెప్పేవాడు, దాని మాంసం విక్రయించేవాడు, కొనేవాడు, తీసుకుని వెళ్ళే వాడు, దాన్ని ముక్కలు చేసి వండేవాడు, దాన్నితినే వాడు ఇలా మొత్తం 8 మందిపై హింసా దోషం తప్పకుండా ఉంటుంది. అలాగే పుణ్య కార్యాలు గానీ పాప కార్యాలు గానీ చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణ చేసేవాడు, చూసి సంతోషించే వాడు వీళ్లందరూ కూడా ఆయా పనులకు తగిన పాప పుణ్యాలు సమాన ఫలితం పొందుతారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాల ముఖ్యమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో మాంసాహారం తినకూడదు అన్న విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Also Read: Nageshwar Jyotirlinga Temple : ద్వారకా నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర పూర్తి వివరాలు

వానాకాలం ముగిసి చలికాలం ప్రారంభమయ్యే సమయంలో రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. కేవలం మనుషుల శరీరంలో మాత్రమే కాకుండా జంతువుల శరీరంలో కూడా ఈ మార్పులు ఉంటాయి. ఆ జంతువులను చంపి తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అలాగే వాతావరణం మందంగా ఉండడం వల్ల తేలికపాటి ఆహారం తింటేనే జీర్ణం అవుతుంది. నాన్ వెజ్ తింటే సరిగా జీర్ణం కాక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

We’re now on WhatsApp. Click to Join.

పైగా నాన్ వెజ్ వంటకాల్లో ఎక్కువగా వినియోగించే ఉల్లి, వెల్లుల్లి కోర్కెలు పెంచుతాయి. అందుకే శాఖాహారులు కూడా ఈ కార్తీకమాసం నెలరోజులు ఉల్లి, వెల్లుల్లి వినియోగించరు. ఎందుకంటే మనం తినే ఆహారమే మన గుణాన్ని నిర్ణయిస్తుంది. అలాగే సాత్విక ఆహారం అంటే స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణంగా తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా వంటి మూలికలను తీసుకోవాలి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ఎప్పుడు ప్రశాంతత కనిపిస్తుంది.