కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ప్రతి రోజు పూజలు, వ్రతాలు, దీపారాధన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. పండితుల సూచనల ప్రకారం చీకటి పడకముందే దీపాలను వెలిగించడం ద్వారా సూర్య కిరణాల శక్తి ఆ దీపాలలో నిక్షిప్తమై ఇంటికి సానుకూల శక్తులను ప్రసారం చేస్తుందని నమ్మకం. తులసి పూజ అనంతరం దీపారాధన చేయడం వల్ల శుభఫలితాలు మరింత పెరుగుతాయని శాస్త్రోక్తంగా చెప్పబడింది. దీపారాధన ద్వారా ఇంటిలో నెగటివ్ శక్తులు తొలగి, ఆధ్యాత్మిక శాంతి నెలకొంటుందని విశ్వాసం ఉంది.
Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణమి.. ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసా?
కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగించడం ప్రత్యేకమైన ఆచారం. పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు శివస్వరూపంగా పూజింపబడుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకింద దీపం వెలిగిస్తే సకల కష్టాలు, పాపాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. ఉసిరికాయను లక్ష్మీదేవి ప్రతిరూపంగా పరిగణించడం వలన ఈ దీపాన్ని వెలిగించిన వారికి ఆర్థిక కష్టాలు తొలగి, సంపద, సౌఖ్యం లభిస్తాయని నమ్మకం ఉంది. అంతేకాదు, ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కూడా అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఇది పుణ్యఫలాన్ని ఇస్తుందని పండితులు సూచిస్తున్నారు.
ఉసిరి దీపం తయారీ విధానం కూడా విశిష్టమైనది. గుండ్రని ఉసిరికాయను తీసుకుని, దాని మధ్య భాగాన్ని జాగ్రత్తగా గుండ్రంగా కోయాలి. ఆ గుండ్ర భాగంలో స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి, చిన్న వత్తిని ఉంచి వెలిగించాలి. ఇలా వెలిగించే ఉసిరి దీపం దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇది భక్తుడి మనసును ప్రశాంతం చేస్తుంది, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నెలకొల్పుతుంది. ఉసిరి దీపాన్ని కార్తీక పౌర్ణమి రాత్రి తులసి చెట్టుకింద లేదా ఉసిరి చెట్టుకింద వెలిగించడం ద్వారా శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి ముగ్గురి కృప ఒకేసారి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర ఆచారం భక్తిని, ధార్మికతను, సానుకూలతను పెంపొందించే శ్రేష్ఠమైన సంప్రదాయం.
