Karthika Masam: కార్తీకమాసంలో స్నానమాచరించే విధానాలు..!

కార్తీక మాసంలో శివాలయాలు, విష్ణుమూర్తి ఆలయాలన్నీ భగవంతుని నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 09:53 AM IST

కార్తీక మాసంలో శివాలయాలు, విష్ణుమూర్తి ఆలయాలన్నీ భగవంతుని నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసం ఉండే వారు, వ్రతాలను ఆచరించే వారు, ముఖ్యంగా కార్తీక దీపం వెలిగించే వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి. గత అక్టోబరు 26న ప్రారంభమైన కార్తీక మాసం నవంబరు 23 వరకు కొనసాగనుంది. సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు. సూర్యోదయానికి ముందే స్నానాన్ని ముగించాలి.

‘‘
సువర్ణ రత్న పుష్పాంబు
పూర్ణ శంఖేన పుణ్యవాన్‌
సువర్ణ పూర్ణా పృథివీ
తేన దత్తా న సంశయ:’’ అనే

మంత్రంతో కార్తిక మాసములో స్నానం, అర్ఘ్యప్రదానం చేస్తే సువర్ణాలు, రత్నాలు, పుష్పజలాలు నిండిన పూర్ణ శంఖంతో, బంగారం నిండి ఉన్న సంపూర్ణ భూమిని దానం చేసిన ఫలం దక్కుతుందని హిందువులు నమ్ముతారు. ఈ మాసంలో ప్రతి రోజు నదీ స్నానం చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ రోజుల్లో నదీ స్నానం చేస్తే మాసఫలం దక్కుతుంది.

ఏకాదశి ప్రత్యేకత

‘ఏకాదశి’అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు ఈ పదకొండు నదీ జలం వంటి పవిత్రమైన భగవత్‌ ధ్యానజలంలో మునుగుట నదీస్నానం. అలాగే ఈ పదకుండుకు బుద్ధిని చేరిస్తే అదే ద్వాదశి స్నానం. ఈ పన్నెండింటికి అంత:కరణం, చిత్తం, అహంకారం అనే మూడు చేరిస్తే పంచదశి అదే పూర్ణిమ స్నానం. వారణాసిలో ఉన్న పంచనదంలో కార్తీకమాస ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులలో సూర్యోదయానికి ముందే నదీస్నానమాచరించిన అత్యంత పుణ్యప్రదం. స్నానమాచరించే సమయంలో క్రింది మంత్రాన్ని పఠించాలి.

దేవ దేవేశ శ్రీకృష్ణ దామోదర నమోస్తుతే

అహం త్వత్‌ ప్రాప్తి కామేన స్నాస్యామి తవ ప్రీతయే

కార్తికే మాసి శ్రద్ధాళు: త్వద్ధ్యాన గత మానస:

త్వాం అర్చయిష్యన్‌ గోవింద అర్ఘ్యం దాస్వామి త్వత్‌ పర: