Site icon HashtagU Telugu

Karthika Masam: కార్తీకమాసంలో ఈ పూజ చేస్తే చాలు.. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందట!

Karthika Masam

Karthika Masam

హిందూ మతంలో కార్తీకమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసేటటువంటి పూజలు విశేష ఫలితాలను అందిస్తాయని చెబుతూ ఉంటారు. కార్తీక మాసాన్ని శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా చెప్పుకుంటారు. ఈ నెల రోజులపాటు ఏ ఇంట చూసినా ఏ దేవాలయాలలో చూసినా కూడా కార్తీక దీపాలు వెలిగిపోతూ ఉంటాయి. ఈ కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ చేసినా, కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతమట. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. ఈ మాసంలో నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీప దానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో శ్రీ మహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం.

కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి , నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించి ఆ నీటితో కార్తీక స్నానాలు చేయాలని చెబుతున్నారు. కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహా విష్ణువును తులసిదళాలతో కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం రోజు, కార్తీక పున్నమి రోజు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతో పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. అయితే కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథులలో కానీ, ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలట. పూర్తి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.