హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో దసరా కూడా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగను దాదాపుగా తొమ్మిది రోజులపాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ తొమ్మిది రోజులు కూడా శరన్నవరాత్రులు అని పిలుస్తుంటారు. అంటే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవార్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పండుగకు దుర్గామాతను ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. ఈ పండుగను ఉత్తర, తూర్పు భారతదేశంలో జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో కథలను చెప్పుకుంటారు.
దుర్గాదేవి రక్షాస రాజు మహిషాసురుడితో వరుసగా తొమ్మిది రోజులు యుద్దం చేసి అతన్ని సంహరిస్తుంది. నవరాత్రుల్లో పదవ రోజును విజయదశమి అంటారు. నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఇకపోతే ఈ నవరాత్రుల సందర్భంగా చాలా మంది కలశస్థాపన చేస్తూ ఉంటారు. కలశాన్ని పూజ గదిలో ప్రతిష్టిస్తూ ఉంటారు. అయితే దుర్గామాత ఆశీస్సులు పొందాలంటే కలశ స్థాపన చేసేటప్పుడు కొన్ని పనులను చేయకూడదని చెబుతున్నారు. అలాగే మరికొన్ని పనులను ఖచ్చితంగా చేయాలని చెబుతున్నారు. మరి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..
కలశ స్థాపన జరిగే స్థలాన్ని సరిగ్గా శుభ్రపరిచి దేవుడి గుడిలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ఏర్పాటు చేసుకునే ముందు దేవుడి గదిని మొత్తం పూర్తిగా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. శుభ ఫలితాలను పొందడం కోసం దుర్గాదేవి ఆశీస్సులు పొందడం కోసం కేవలం శుభ ముహూర్తంలో మాత్రమే ఈ కలశ స్థాపన జరగాలని చెబుతున్నారు. కలశ స్థాపనకు మట్టి లేదా రాగి అలాగే వెండి కలశాన్ని మాత్రమే ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. అయితే అవి వంగిపోవడం లేదంటే పగిలిపోయి ఉండకూడదట. అదేవిధంగా కలశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొమ్మిది రోజులు పాటు ఎవరు తాగకుండా చూసుకోవాలట. ఈ కలశాన్ని కేవలం ఉత్తరం లేదా తూర్పు దిశలకు ఎదురుగా మాత్రమే ఉంచాలని చెబుతున్నారు. కలశాన్ని మామిడి ఆకులను అలాగే ఎరుపు వస్త్రాన్ని ఉపయోగించి శుభప్రదంగా అలంకరించాలని చెబుతున్నారు. కలశ స్థాపన చేసిన తర్వాత మాంసాహారం వంటివి తినకూడదని చెబుతున్నారు.