డా. ప్రసాదమూర్తి
అండ పిండ బ్రహ్మాండ చండ ప్రచండమార్తాండ తేజా.. మహాప్రభో! మీరన్నది నిజం నిజం. ఇది కేవలం తారీకు కాదు. ఒక నవీన కాలచక్ర శుభారంభం. అవును దేవా మీరన్నది నిజం. ఈ తేదీని తేదీగా, ఈ తేదీలో అంకెలను అంకెలుగా కాదు, ఇది ఒక మహిమాన్విత అక్షర సాక్షాత్కారంగా, మీ మనోవాక్కాయ ధర్మదీక్షా సంజనిత నక్షత్ర పుంజంగా గుర్తుంచుకుంటాం. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగల మహా శక్తిమంతుడా.. మీ అరచేతుల ఆకాశాల నుంచి మరోసారి త్రేతా యుగం తన చక్రాన్ని ప్రారంభించిందని విశ్వసిస్తున్నాం. మందిర్ వహీ బనేగా.. మందిర్ వహీ బనాయ. ఇది మీ మందిరం. ఇది మీ రాజ్యం. ఇక మీ మాటే శాసనం. మహానుభావా.. ఆసేతు హిమాచల భారతావని హృదయ ఫలకం మీద మీ పవిత్ర కరకమలాలతో లిఖించిన ఈ తారీకు యుగయుగాలు ప్రజ్వలిస్తుంది.
బహుత్ యాద్ రహేగా బహుత్ బహుత్ యాద్ రహేగా యహ్ తారీక్. ఈ తారీకు బాగా బాగా గుర్తుంటుంది చాలా చాలా గుర్తు చేస్తుంది. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని నిర్మూలించి, కీర్తించే స్వక్షాన్ని రక్షించి ధర్మానికి సరికొత్త తాత్పర్యాన్ని ప్రబోధించే కలియుగ ధర్మ పురుషునిగా ఈ తారీకు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది. పితృ వాక్య పరిపాలనా ధర్మం కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన ఆనాటి యుగపురుషుడు రాముడు. అన్ని ధర్మాలూ రాజ్యం కోసమే అన్న పరమ ధర్మాన్ని బోధించిన ఈనాటి రాజకీయ రఘు రాముడు మీరు. అదే ఈ కాలచక్రం తిరిగి తిరిగి ఇక్కడ ఆగిన ఈ తేదీ పదే పదే గుర్తు చేస్తుంది. కలియుగాన్ని త్రేతా యుగంలోకి.. త్రేతా యుగాన్ని కలియుగంలోకి నడిపించిన కాలపురుషా..మీరు రాసిందే తారీకు.. మీరు చెప్పిందే ధర్మం. మీరు చేసిందే రాజ్యం.
అసంపూర్ణ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట శాస్త్ర సమ్మతం కాదన్న శంకరాచార్యులు మీ పావన దృష్టిలో వంకరాచార్యులే. మీరు కట్టిందే గుడి.. మీరు పెట్టిందే ముహూర్తం. కూల్చింది ఒక మత విశ్వాసాన్నో.. లేక ఒక లౌకిక రాజ్యాంగాన్నో అర్థం కాక తల బాదుకున్న ఒక తారీకును ఈ తారీకు ఎప్పటికీ గుర్తు చేస్తుంది. ఒక మత విశ్వాసాన్ని కూల్చివేయడం ఘోర అపరాధం అని అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించిన తారీకు గుర్తుంది. అదంతా అధిక ప్రసంగం అని మీరు చేసిన మౌన పరిహాసాన్ని ఈ తారీకు మరింత పరిహాసంగా గుర్తు చేస్తుంది. మతంలో న్యాయస్థానానికి స్థానం లేదన్న మీ మతతార్కిక ధార్మిక వాదానికి తిరుగులేదు. ఆర్కియాలజీ సర్వే ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదని పెదవి విరిచిన న్యాయమూర్తులను చూచి భ్రుకుటి ముడిచిన మీ ప్రకటిత ఆగ్రహాన్ని కూడా ఈ తారీకు గుర్తు చేస్తోంది. ఇక లిబర్హాన్ కమిషన్ నివేదిక కోసం మీరు నిర్మించిన ఒక దేశమంత చెత్తకుండీ మీద ఈ తారీకు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటుంది.
ఈ తారీకు మరెన్నో తారీకులను గుర్తుచేస్తుంది. గడిచిన ఎన్నికల తారీకులు.. రాబోయే ఎన్నికల తారీకులు ఈ తారీకు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి.
సర్వశక్తి సంపన్నులైన త్రిమూర్తుల ఏకైక అవతార మూర్తీ.. ఇక మీరు నడిచిందే దారి. మీరు పొడిచిందే పొద్దు. కుప్పకూలిన యుగయుగాల లౌకిక స్వప్న సౌధం శిథిలాల్లోంచి మొలకెత్తే మీ అనేకానేక ఛాయామూర్తుల చిద్విలాస సంగీత సమరంభంలో ఇక ఈ ప్రజాస్వామ్యం పరిమళించుగాక. దిక్కుతోచక బిక్కచచ్చి చెల్లాచదురై ఉన్న నీ శత్రుపక్షాలు, ఏమో.. శక్తినంతా కూడగట్టుకుని ఒక్కటయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఏమైందిలే స్వామీ.. మధుర మీ వెంట ఉంది. కాశీ మీ కంట ఉంది. మరిన్ని నగరాల ఆకుపచ్చ నెలవంకల అభద్ర నిలయాల భరోసా ఉంది. రాజ్యాంగ సంస్థల జాగిలాల కాపలా ఉంది. మీడియా బంధుగణ వందిమాగద బృందగానం ఉండనే ఉంది. ఇక మీ ప్రస్థానం అనంతం.. మీ కీర్తి దిగంతం.