మహాబలుడు, బుద్ధిశాలి, కపి శ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత .. ఇవన్నీ హనుమంతుడి పేర్లు. అంజనాదేవి గర్భాన జన్మించడం వల్ల ఆయన ఆంజనేయుడయ్యాడు. అయితే ఆంజనేయుడి పుట్టుక (hanuman birth secret) వెనుక పురాణాల్లో వివిధ రకాల గాథలు ఉన్నాయి. శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత గ్రంథాల్లో ఈ అంశం గురించి భిన్న విభిన్నంగా చెప్పారు. ఆంజనేయుడి జన్మరహస్యం గురించి ఏ పురాణంలో ఏముంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అంజనాదేవిలోకి చెవిద్వారా..
ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి రోజున జన్మించాడు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో పరిపూర్ణ అవతారం రాముడు. అలాంటి రాముడి కార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు వీర్య స్ఖలనం చేయగా.. ఆ స్ఖలనాన్ని సప్తర్షులు గౌతముడి కుమార్తె అయిన అంజనాదేవిలోకి చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా వానరదేహంతో ఆమెకు శివుడు జన్మించాడని (hanuman birth secret) శివ మహాపురాణంలో ఉంది. అందుకే హనుమంతుడిని శివసుతుడు అంటారు. శివుడి పదకొండో అవతారమే హనుమంతుడు అని పరాశర సంహితలో పేర్కొన్నారు. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహా విష్ణువు పరమశివుడికి సహకరించినందున..అందుకు రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరించాడని ఈ సంహిత చెబుతోంది.
also read : Hanuman: హనుమంతుడితో పాటు ఈ 8 మంది కూడా చిరంజీవులే
శివవీర్యాన్ని ఓ పండుగా మలిచి..
రాక్షస సంహారం కోసం శ్రీ మహా విష్ణువు సూచనమేరకు త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ తర్వాత శివుడి వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది. అగ్నిదేవుడు భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఓ పండుగా మలిచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండు తిన్న ఫలితంగా అంజనాదేవి గర్భం దాల్చి కుమారుడిని ప్రసవించింది. వాయు ప్రసాదంతో జన్మించిన వాడు కావడం వల్ల వాయుపుత్రుడు అయ్యాడు. భగవత్ అనుగ్రహం వల్లే పుత్రుడు పుట్టాడు కనుక కన్యత్వ దోషం లేదని అంజనాదేవికి ఆకాశవాణి ధైర్యాన్నిఇచ్చిందని అంటారు.
దేవలోకంలో ఉండే పుంజికస్థల అనే అప్సరస కాంత దేవ గురువు బృహస్పతి శాపం వల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి. వానరరాజైన కేసరి ఆమెను పెళ్లి చేసుకుంది. కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజన రక్షణ బాధ్యతలను వాయువుకు అప్పజెప్పాడని వాల్మీకి రామాయణంలో ఉంది. ఈక్రమంలో అంజన అందానికి మోహితుడైన వాయుదేవుడు ఆమెను కౌగలించుకుంటాడు. తన వ్రతం భంగమైందని అంజనాదేవి బాధపడగా…ధైర్యం చెప్పి పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని వరం ఇస్తాడు. అలా వైశాఖ బహుళ దశమినాడు ఆంజనేయుడికి అంజనాదేవి జన్మనిచ్చింది .
సూర్యుణ్ని చూసి పండుగా భావించి..
ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆంజనేయుడు దాన్ని పండుగా భావించి.. తినేందుకు ఆకాశంలోకి ఎగిరాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే హనుమంతుడనే పేరు వచ్చింది . అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకర సువనుడుగానూ లోక ప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాలను వెల్లడిస్తున్నాయి.
also read : Lord Hanuman : మంగళవారం హనుమంతుడి గురించి ఈ కథ తెలుసుకుంటే దరిద్రం పోయి…కోటీశ్వరులు అవుతారు..