డా.ప్రసాదమూర్తి
రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొందరు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని, తప్పు చేసిందని చాలామంది మాట్లాడుతున్నారు. ఆఖరికి ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీలో కూడా మతభేదాలు ఉన్నాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బిజెపి కోరుకున్నది కూడా ఇదే కదా. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరైతే తాము సాధించిన ఘనతకు ఆ పార్టీ మొత్తం వంత పాడినట్టు అవుతుందని, హాజరు కాకపోతే ఆ పార్టీని రామవిరోధి, హిందూ విరోధి పార్టీగా ముద్రవేయొచ్చని బిజెపి భావన. మొత్తానికి రామ విరోధి అనే ముద్ర పడినా సరే ఈ రామ మందిరం కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. రానురాను రామ మందిర ప్రారంభోత్సవం చుట్టూ అల్లుకుంటున్న రాజకీయాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే సమంజసమైనదని ఇప్పుడు అందరూ భావించే తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే రామ మందిర నిర్మాణం పట్ల, రాముడి పట్ల, రాముడి చుట్టూ పెనవేసుకున్న హిందువుల మనోభావాల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు, ప్రగాఢ విశ్వాసాలు ఉన్న శంకరాచార్యుల వారే మందిర ప్రారంభోత్సవం వెనక రాజకీయ వ్యూహం ఉందని ప్రత్యక్షంగా విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీది ఏముంది? కనుక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇప్పుడు అనుకోవాల్సి వస్తోంది. అయితే ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ఎజెండాగా మార్చడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి వారు కాంగ్రెస్ పార్టీ నేతలనే కాదు శంకరాచార్యులను కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆఖరికి శంకరాచార్యులకు కూడా రాజకీయ ఉద్దేశాలు అంటగడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం రాను రాను హిందూ సమాజంలోనే ఒక పెద్ద విభజన సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనిపించడమే కాదు ఇప్పటికే ఆ విభజన రేఖ స్పష్టపడిందని సాక్షాత్తు జ్యోతిష్ పీఠ శంకరాచార్యులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శంకరాచార్యులు ఏం చెప్తున్నారు?
దేశంలో నాలుగు ముఖ్యమైన పీఠాలకు సంబంధించిన నలుగురు శంకరాచార్యులు ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదు. వారిలో అతి ముఖ్యమైన పూరీ శంకరాచార్యులు బహిరంగంగానే నరేంద్ర మోడీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శ పత్రికల్లో వైరల్ అయింది. చాలా ఇంటర్వ్యూలలో ఆయన మాటలను ప్రస్తావిస్తున్నారు. “ రాజకీయ నాయకులకు వారి పరిమితులు ఉన్నాయి. ధార్మిక విషయాలలో వారి జోక్యం పిచ్చితనం. ఒక వ్యక్తి ప్రచారం కోసం ధార్మిక నియమాలను ఉల్లంఘించడం దేవుడు మీద తిరుగుబాటే అవుతుంది” ఇలా పూరీ శంకరాచార్యులు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్ తన ఇంటర్వ్యూలో జ్యోతిష్ పీఠ్ శంకరాచార్యులు, స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతితో ప్రస్తావించినప్పుడు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు దీన్ని సమర్థించారు. అంతేకాదు రామ మందిర నిర్మాణం పరిపూర్ణం కాలేదని, పూర్తికాని ఆలయంలో విగ్రహాలు పెట్టి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం శాస్త్రసమ్మతం కాదని, అది ధర్మ విరుద్ధమని ఆయన ఈ ఇంటర్వ్యూలో కరాఖండిగా చెప్పారు. మందిరం అంటే వాస్తు శాస్త్రం ప్రకారం దేహంతో సమానం అని, విగ్రహం ప్రాణమని, గోపురం ఆ దేహానికి శిరస్సు అని, శిరస్సు లేని దేహానికి ప్రాణ ప్రతిష్ఠ ఏమిటని ఆయన శాస్త్రబద్ధమైన ప్రశ్న సంధించారు. అంతేకాదు, రామ మందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత దేశంలోని శంకరాచార్యులు రామానుజాచార్యులు తదితరులైన సనాతన ధార్మికులు, పండితులు, వేదవిదులు మొదలైన వారితో ఒక ట్రస్ట్ ఏర్పడిందని, ఆ ట్రస్టును మార్చివేసి నరేంద్ర మోడీ తన కార్యకర్తలతో నింపివేశారని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగలేదు, హడావిడిగా మందిర నిర్మాణం పూర్తి కాకపోయినా సరే మందిర ప్రారంభోత్సవం చేయడానికి జనవరిలోనే ముహూర్తం పెట్టమని ప్రఖ్యాత కాశీ జ్యోతిష్కులు ఒకరిని ప్రభుత్వం ఒత్తిడి చేసిందని, ఈ విషయాన్ని ఆ జ్యోతిష్యుడే చెప్పారని శంకరాచార్యులు తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే దేశంలో హిందూ ధర్మానికి, హిందూ మత విశ్వాసాలకు సర్వోన్నత ప్రతినిధులుగా అందరూ భావించే శంకరాచార్యుల వారే జరుగుతున్న రామ మందిర రాజకీయాన్ని విమర్శిస్తున్నట్టుగా తేటతెల్లమవుతుంది. మరి ఇంత స్పష్టమైన రాజకీయం జరుగుతుంటే రానున్న ఎన్నికల కోసమే ఒక అసంపూర్ణ మందిరంలో రామ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడం అధార్మికమని ప్రసిద్ధ శంకరాచార్యులు చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తప్పెలా అవుతుంది? ఇప్పటికీ ఈ వ్యవహారంలో రాజు కుంటున్న రాజకీయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని చెప్పాలి. కనీసం కాంగ్రెస్ పార్టీ రామ మందిరం చుట్టూ రాజకీయమే ఉంది, అక్కడ రాముడు లేడని, ఆ రాజకీయ ప్రారంభోత్సవానికి తామెందుకు వెళ్తామని చెబుతోంది. క్రమంగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకామని తేల్చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదనేది పలువురు విశ్లేషకుల అభిప్రాయం.
Read Also : Kerala: చరిత్రలో తొలిసారిగా పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగం