Site icon HashtagU Telugu

Varalakshmi Vratam: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam

Varalakshmi Vratam

Varalakshmi Vratam: ఆధ్యాత్మిక పండితుల ప్రకారం గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని (Varalakshmi Vratam) నిస్సంకోచంగా ఆచరించవచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే గర్భిణీలు కఠినమైన ఉపవాసాలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. అయితే ఐదు నెలలలోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి. ఆరో నెల వస్తే మాత్రం చేసుకోకూడద‌ని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఐదు నెలలు లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఆచరించవచ్చు.

శ్రావణ మాసం అంటేనే వ్రతాలకు, పూజలకు, పండుగలకు నెలవు. ఈ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) అత్యంత విశేషమైనది. సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

అయితే ఈ వ్ర‌త స‌మ‌యంలో గర్భిణీలు ఉపవాసం ఉండటం తల్లి ఆరోగ్యానికి, కడుపులో ఉన్న బిడ్డ పెరుగుదలకు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి, ఉపవాసం బదులుగా తేలికపాటి ఆహారం, పండ్లు, పాలు వంటివి తీసుకోవడం మంచిది.

Also Read: Car Driving Tips: కొత్త‌గా కారు డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

గర్భిణీలు పాటించాల్సిన నియమాలు

గర్భిణీలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ సూచనలు పాటించడం వల్ల పూజ, ఆరోగ్యం రెండింటినీ సమన్వయం చేసుకోవచ్చు.

ఉపవాసం చేయవద్దు: కఠినమైన ఉపవాసం బదులుగా పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, లేదా తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. వ్రతం తర్వాత అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని తీసుకోవడం మంచిది.

కొబ్బరికాయ కొట్టవద్దు: కొన్ని శాస్త్రాల ప్రకారం గర్భిణీలు కొబ్బరికాయ కొట్టకూడదు. ఈ పనిని ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు చేయవచ్చు.

ఎక్కువసేపు కూర్చోవద్దు: పూజలు చేసేటప్పుడు ఎక్కువసేపు నేల మీద కూర్చోవడం మంచిది కాదు. వీలైనంత వరకు మధ్యలో లేచి నడవడం, కుర్చీలో కూర్చుని పూజ చేయడం వంటివి చేయవచ్చు.

అధిక శ్రమ వద్దు: పూజకు ముందు ఇల్లు శుభ్రం చేయడం, పిండి వంటలు చేయడం వంటి పనులను ఇంట్లో ఇతరుల సహాయంతో చేసుకోవడం ఉత్తమం.

నీరసం రాకుండా చూసుకోండి: పూజలో ఉన్నప్పుడు నీరసం అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. శరీరానికి అవసరమైనంత శక్తి ఉండేలా చూసుకోవాలి.

గర్భిణీలు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి, వైద్యుని సలహా మేరకు ఈ వ్రతాన్ని ఆచరించడం ఉత్తమం. ఏది ఏమైనప్పటికీ.. వ్రత ఉద్దేశం భక్తి, శ్రద్ధ కాబట్టి శారీరక శ్రమ లేకుండా పూజను ఆచరించినప్పటికీ పూర్తి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.