ఈ కాలం లో నోములు … వ్రతాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. ఇరుగుపొరుగు ముత్తయిదువులంతా కలిసి ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ నోములు … వ్రతాలు చేస్తుంటారు. అందువలన ఈ మాసంలో ప్రతి ఒక్క ఇల్లు ముత్తయిదువులతో కళకళలాడుతుంటుంది.
ఇక నోముగానీ … వ్రతంగాని పూర్తయిన తరువాత పేరంటాలుగా వచ్చిన ముత్తయిదువులకు రెండు అరటి పండ్లను .. రెండు వక్కలను … రెండు తమలపాకుల్లో పెట్టి తాంబూలంగా ఇస్తుంటారు. కొందరు అరటిపండ్ల స్థానంలో కమలాకాయలను పెట్టి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒకే రోజున ఎక్కువ మంది ఇళ్లలో వ్రతాలు జరుగుతుంటాయి కనుక, ఒకరింటికి ఒకరు వచ్చి తాంబూలం అందుకుని వెళుతుంటారు.
అయితే కొంతమంది ఒక ఇంట్లో తమకి ఇచ్చిన తాంబూలాన్ని, తమ ఇంటికి వచ్చిన వారికి ఇస్తుంటారు. ఇక ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లవలసి వచ్చినప్పుడు, మొదటి ఇంట్లో ఇచ్చిన తాంబూలాన్ని దారిలో తెలిసినవారికి ఇచ్చేసి రెండో ఇంటికి వెళుతుంటారు. ఈ విధంగా చేయడం వలన పేరంటానికి వెళ్లిన ఫలితం దక్కకుండా పోతుంది.
అంతే కాకుండా ఆయా దైవాలపట్ల … పూజా విధానాల పట్ల నిర్లక్ష్యభావనను ప్రదర్శించిన దోషం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే ఒకరిచ్చిన తాంబూలాన్ని మరొకరికి ఇవ్వకూడదని అంటోంది. ఎవరు స్వీకరించిన తాంబూలం వారు ఉపయోగించినప్పుడే, పేరంటానికి వెళ్లిన ప్రయోజనం సిద్ధిస్తుంది … ఫలితం లభిస్తుంది.
