Site icon HashtagU Telugu

Indrakiladri: దసరా ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి!

Indrakiladri

Indrakiladri

Indrakiladri: తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి అనుకుంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నడిబొడ్డులో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై వున్న కనకదుర్గ దేవాలయం. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తర్వాత ఆంధ్రలో రెండవ పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతిగాంచింది. మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేద వ్యాసుని సలహామేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మ వారు కీలుని పర్వతంగా నిలబడమని కృత యుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మ వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవత లు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన త్రైలోక్య మాత మహిషాసురమర్ధిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.

ఆదిశంకరాచార్యులవారు తమ పర్యటనలలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా వున్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని పురాణ కథనం. ఇక్కడే 12వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం తోపాటు మల్లేశ్వరాలయం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యే శ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. దసరా రోజు తెల్లవారుఝాము నుంచి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అన్నదానంతోపాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. అవతారాలు- నైవేద్యాలు దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. త్వరలో జరగనున్న నవరాత్రి ఉత్సవాలకు ఈ ఆలయం ముస్తాబవుతోంది. ఇప్పట్నుంచే పనులు మొదలుపెట్టారు.