మన దేశవ్యాప్తంగా ఉన్న ఎక్కువ ఆలయాలలో పరమేశ్వరుడి ఆలయాలు కూడా ఒకటి. దేవుళ్ళతో పరమేశ్వరుడి ఆలయాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క అవతారంలో ఒక్కో పేరుతో దర్శనమిస్తూ భక్తులకు కోరికలు తీరుస్తున్నాడు ఆ బోలా శంకరుడు. అంతేకాకుండా ఆ బోలా శంకరుడు ఉన్న స్థలాలు కూడా అంతటి విశేషాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కో ఆలయం ఒక్కో ప్రత్యేకతను చాటుతూ భక్తులను అలరిస్తున్నాయి. ఇకపోతే పరమేశ్వరుడు దర్శనమిస్తున్న ఆలయాలలో ఒక ప్రాచీన కాలం నాటి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా ప్రత్యేకత చెందిన శివాలయాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి లోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి. ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో సాక్షాత్తూ ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టించిన శివాలయం కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు. అయితే ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుందట. బుగ్గ అనగా నీటి ఊట. వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, ఊరంతా నీటి వనరులు ఎండిపోయినా ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నిత్యం నీరు ఊరుతూనే ఉంటుందట. అయితే ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి.
ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటం వల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. కాగా ఈ ఆలయాన్ని రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు శ్రమించి నిర్మించారట. శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని ప్రౌఢ దేవరాయల పాలనలో తాడిపత్రి పెమ్మసాని రామలింగ నాయకుడు మండలాధీశుడుగా ఉన్న కాలంలో తిమ్మనాయుడు, పెమ్మసాని రామలింగ నాయకుడు స్థానికంగా దొరికిన రాళ్ళతో నిర్మించారట. అయితే ఈ ఆలయం పక్కనే పెన్నా నది ప్రవహిస్తుంది. పెన్నా నదికి దక్షిణం వైపున ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత. అలాగే ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల తాళపత్ర లేదా తాటిపత్రి అనే పేరు వచ్చి కాలక్రమేణా అదే తాడిపత్రిగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలోకి ప్రవేశం చేసే సమయంలో ముఖద్వార ప్రవేశములోనే ఎంతో అద్భుతమైన శిల్పాలను తిలకించవచ్చు. ఈ శిల్పాలు గ్రీకు శిల్పకళను పోలి ఉంటాయి. ముఖ ద్వారానికి ఇరువైపులా గంగాతోరణ శిల్పాలు ఎంతో అందంగా స్వాగతం పలుకుతాయి. అయితే ఇక్కడ శివాలయంలోని శివలింగం కింద నుంచి ఊరే నీటి బుగ్గ రహస్యం ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆ నీటి బుగ్గ లోని నీరు ఎక్కడ నుంచి వస్తోందో, మండు వేసవిలో కూడా ఎండి పోకుండా నిరంతరం జలధార రావడం ఎవరికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.