Site icon HashtagU Telugu

Peepal Tree : ఆ రోజు రావిచెట్టును తాకితే అరిష్టం..

Ravi Chettu

Ravi Chettu

వృక్షములలో రావిచెట్టు (అశ్వత్థ వృక్షం) దేవతా వృక్షంగా చెప్పబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే సహజంగానే పవిత్రమైన భావన కలుగుతుంది.

విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఆకులతో గలగలమంటూ అదిచేసే ధ్వని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తూ వుంటుంది. కార్తీక మాసంలో ‘ఉసిరిచెట్టు’ … విజయదశమి రోజున ‘శమీ వృక్షం’ … పూజించబడుతుంటాయి. ఇక రావిచెట్టు విషయానికి వచ్చేసరికి, ఇది అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన, ఆ కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వసిస్తుంటారు.

ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు.అలాంటి రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని చెప్పబడుతోంది. ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చని స్పష్టం చేయబడుతోంది.