Bhogipallu : భోగి పండుగ రోజున భోగి మంటలు వేయడంతో పాటు.. 12 ఏళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఇందుకోసం చిన్న రేగుపళ్లును వాడుతారు. భోగి మరునాడు సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడు. అలాగే సూర్యుడు గతిని మార్చుకున్నవేళ.. ఆయన మాదిరిగా గుండ్రంగా, ఎర్రగా ఉండే రేగుపండ్లను పిల్లల మీద పోయడం ద్వారా వారికి సూర్యానుగ్రహం కలుగుతుందని నమ్మకం. అందుకే భోగి రోజు సూర్యాస్తమయం లోపు భోగిపండ్ల వేడుకను ముగిస్తారు. రేగిపండును అర్కఫలం అని కూడా అంటారు.
రేగుకాయలకు బదరీఫలం అనే పేరు కూడా ఉంది. పూర్వకాలంలో నరనారాయణులు ఈ బదరికా వనంలో శివుడి గురించి ఘోర తపస్సు చేయగా.. దేవతలు వారిపై బదరీ ఫలాలను వర్షింపజేశారట. నాటి ఘటనకు గుర్తుగా నారాయణుని స్వరూపంగా భావించి.. బాలబాలికల తలపై భోగిపండ్లను పోస్తారు. అలాగే చిన్ని కృష్ణుడిని తలపించే పిల్లలకు దిష్టి తగలకుండా ఉండేందుకు కూడా ఈ భోగిపండ్లను పోస్తారన్న కథ కూడా ఉంది.
తూర్పు ముఖంగా పిల్లల్ని కూర్చోబెట్టి.. తల్లి వారికి బొట్టుపెట్టి, కుడిచేతివైపునుంచి ఒకసారి భోగిపండ్లను తిప్పి తలమీద పోయాలి. అలాగే రెండోసారి ఎడమవైపు నుంచి తిప్పి పోయాలి. పేరంటానికి వచ్చినవారంతా పిల్లలకు భోగిపండ్లు పోశాక పిల్లలకు హారతినిచ్చి.. హారతి పాట పాడించి.. అందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి. పిల్లలకు పోసిన భోగిపండ్లు తినరు. నేలపై పడినవాటన్నింటినీ ఏరి.. సంక్రాంతి తర్వాత సోమ, బుధ, శని, ఆదివారాల్లో దూరంగా పారేస్తారు. ఇలా పిల్లలకు పోసే భోగిపండ్లలో చెరకుగడల ముక్కలు, బంతిపూల రెమ్మలు, చిల్లర నాణేలు, నానబెట్టిన శనగలను కూడా కలుపుతారు. వైద్యపరిభాషలో కేలండ్యులాగా పిలుచుకునే బంతిపూలు శరీరానికి తగిలితే ఎలాంటి చర్మవ్యాధి అయినా నయమైపోతుందని పెద్దలు చెబుతారు.