Site icon HashtagU Telugu

Bhagini Hastha Bhojanam : భగినీ హస్త భోజనం అంటే ఏంటి ? అన్నదమ్ములకు ఎందుకు భోజనం పెట్టాలి ?

bhagini hastha bhojanam

bhagini hastha bhojanam

Bhagini Hastha Bhojanam : హిందూ సంప్రదాయాల ప్రకారం.. శ్రావణ శుద్ధపౌర్ణమి నాడు రాఖీపూర్ణిమ పండుగను జరుపుకుంటాం. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ఈ పండుగనే ప్రతీకగా భావిస్తారు. కానీ.. సోదర సోదరీమణుల బంధానికి గుర్తుగా భగినీహస్తభోజనం అనే మరో పండుగ కూడా ఉంది.

దీపావళి పండుగ జరిగిన రెండవరోజు అనగా కార్తీక శుద్ధ విదియనాడు ఈ పండుగ వస్తుంది. ఈ రోజున సోదరి ఇంట్లో భోజనం చేసిన అన్నదమ్ములకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ భగిని అంటే అక్క లేదా చెల్లి. హస్తభోజనం అంటే.. ఆమె చేతితో వండిన వంట. సోదరి చేసిన వంటను తినడమే భగినీహస్త భోజనం.

ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఒక పురాణకథ కూడా ఉంది. సూర్యుడు – సంధ్యాదేవికి కలిగిన సంతానం యమడు, యమున. యమున అంటే యముడికి ప్రాణం. ముద్దుగా యమీ అని పిలిచేవాడట. యమునకు పెళ్లయ్యాక ఆమెకు అన్నను చూడాలనిపించింది. ఒకరోజు ఇంటికి భోజనానికి రమ్మని కబురుచేసి.. యముడికి ఇష్టమైనవన్నీ తయారుచేసింది. ఎంతసేపైనా యముడు భోజనానికి రాలేదు. తన కర్తవ్యపాలనలో పడి భోజనానికి రాలేకపోయానని, కార్తీకశుద్ధ విదియరోజున తప్పనిసరిగా వస్తానని కబురు పంపాడు. చెప్పినట్లుగా ఆ రోజున భోజనానికి వెళ్తాడు.

ఇంటికి వచ్చిన అన్నకు బొట్టుపెట్టి.. అతిథి మర్యాదలన్నీ చేసి, తాను వండినవన్నీ కొసరికొసరి వడ్డిస్తుంది. భోజనం పూర్తయ్యాక యముడు సంతోషంతో.. నీకేం కావాలో కోరుకో అని యమునను అడగగా.. ప్రతిఏటా ఇలాగే భోజనానికి రావాలని, ఈ రోజునే భూలోకంలోని సోదరులంతా నీలాగే వారి తోబుట్టువులను చూసి వారింట్లో భోజనం చేయాలని కోరిందట. ఆనాటి నుంచి భగినీ హస్తభోజనం ఒక పండుగలా జరుగుతూ వస్తోంది.

భగినీ హస్తభోజనం జరిగిన మరునాడు యముడు తన సోదరిని ఇంటికి పిలిచి అంతకన్నా గొప్పగా ఆతిథ్యమిచ్చి సంతోషంగా సాగనంపుతాడు. దీనిని సోదరీ తృతీయ పేరుతో జరుపుకుంటారు. ఇది కొన్నిప్రాంతాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ పండుగను మరాఠీలు భయ్యా-దుజ్, నేపాలీలు భాయి-టికా, పంజాబీలు టిక్కా అని పిలుస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని, యమునను స్మరిస్తే.. వివాహితలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్మకం.

Exit mobile version