Site icon HashtagU Telugu

Akshintalu: ఆశీర్వదించినప్పుడు అక్షింతలు ఎందుకు వేస్తారో తెలుసా?

Akshintalu

Akshintalu

సాధారణంగా పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు అక్షింతలను ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలో అక్షింతలు వేసి మరి దీవిస్తూ ఉంటారు. అయితే అక్షింతలు ఎందుకు వేస్తారు అన్నది మనలో చాలా మందికి తెలియదు. అక్షతమ్ అంటే పరిపూర్ణమైనది, కొరతలేనిది, నిండైనదని అర్థం. జీవితంలో కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని కోరుకుని ఆశీర్వదించడమే అక్షింతలు వేయడంలో ముఖ్య ఉద్దేశం.

పసుపు కలిపిన బియ్యం మంగళ ప్రధమైనవి. అందుకే బియ్యంలో పసుపు కలిపి అక్షింతలు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెబుతుంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతి కరమైనవి బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణం, వ్యసనం వీటన్నిటికి చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయి అని గట్టిగా విశ్వసిస్తారు.

అందుకే అక్షతలను తల పై వేసి ఆశీర్వదిస్తారు. కాగా అదే అక్షింతలకు సైంటిఫిక్‌గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది. దేహం ఒక విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చు తగ్గులు మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షింతలు తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి పుచ్చుకునే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. దేహంలో ఉన్న 24 విద్యుత్ కేంద్రాల్లో శిరస్సు ప్రధానమైనది. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అందుకే అక్షతల ద్వార పెద్దల్లో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది. పసుపు క్రిమి సంహారకం కూడా కావడంతో ఆరోగ్యానికి కూడా మంచింది.