Diwali 2023 : దీపావళిని మనదేశంలో ఏయే ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసా ?

ఉత్తర భారతంలో.. సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణుడిని శ్రీరామచంద్రుడు ఓడించి.. తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. లంక నుంచి సీతమ్మతో..

  • Written By:
  • Updated On - November 7, 2023 / 09:38 PM IST

Diwali 2023 : దీపావళి.. అంటే దీపాల యొక్క ఆవళి. దీపాల పండుగ. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి గుర్తుగా.. ప్రతిఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున యావత్ దేశం, ప్రవాస భారతీయులు దీపావళిని జరుపుకుంటారు. మనదేశంలో దీపావళికి ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉన్నాయి. అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగల్లో ఇది కూడా ఒకటి. హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమతమ సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడం వెనుక పురాణాల్లో వివిధ కథలు ఉన్నాయి.

ఉత్తర భారతంలో.. సీతమ్మను ఎత్తుకెళ్లిన రావణుడిని శ్రీరామచంద్రుడు ఓడించి.. తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. లంక నుంచి సీతమ్మతో కలిసివచ్చిన రాములవారిని స్వాగతించేందుకు ప్రజలు నూనె దీపాలను వెలిగించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ దీపాలను ఇళ్లు, వీధుల్లో అలంకరించి.. పటాకులు కాల్చి, స్వీట్లు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే ఇప్పటికీ కూడా దీపావళిరోజున ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుని.. పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

పశ్చిమభారతంలో దీపావళి పండుగను చాలా ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మిదేవిని పూజించి, దీపాల పండుగను పురస్కరించుకుని ఇళ్ల ముందు వివిధ రంగులతో రంగవల్లులు వేస్తారు. సంప్రదాయమైన వంటలను తయారుచేసి స్నేహితులు, బంధువులకు పంచి ఇంటిల్లిపాది ఆరగిస్తారు.

దక్షిణభారతంలోనూ దీపావళిరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే గణేశుడిని పూజిస్తారు. ఇక్కడిప్రజలు తెల్లవారుజామునే లేచి.. తలకు నూనె రాసుకుని స్నానం చేసి.. కొత్తదుస్తులు ధరిస్తారు. ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా గడుపుతారు. కొత్తఅల్లుళ్లు దీపావళికి అత్తగారింటికి టపాసులు కొనివ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

తూర్పు భారతదేశంలో.. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో దీపావళిరోజున కాళీమాతను పూజిస్తారు. ఆమెను పూజించడం వల్ల శక్తియుక్తులు వస్తాయని భక్తుల నమ్మిక. దేవాలయాలు, కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి వాటికి పూజలుచేస్తారు. మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగించి.. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను, రావణకాష్టాన్ని నిర్వహిస్తారు.