Nanjundeshwara Temple : మనకేదైనా కష్టమొస్తే వెంటనే దేవుడు గుర్తొస్తాడు. దేవుడా.. ఏంటి నాకీ కష్టాలు అనుకుంటూ.. ఆ దేవుడిని స్మరించుకుంటాం. అలాగే తరచూ అనారోగ్యాలకు గురయ్యే వారు కూడా తమకు రోగాలన్నీ తగ్గిపోవాలని దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటారు. భక్తుల నమ్మకాలకు తగ్గట్టుగానే కొన్ని ఆలయాలు నమ్మశక్యం కాని మహిమలకు నిలయాలుగా ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయంలో దేవుడిని దర్శించుకుంటే.. అనతికాలంలోనే ఆరోగ్యవంతులవుతారని పేరు ఉంది. అదే కర్ణాటకలోని నంజున్ దేశ్వర ఆలయం.
ఈ మహిమాన్విత ఆలయం మైసూరుకు సమీపంలోని నంజున్ గడ్ జిల్లాలో ఉంది. దక్షిణకాశీగా పిలిచే ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామిని శ్రీ కంఠేశ్వరుడు అని పిలుస్తారు. సాక్షాత్తూ గౌతమ మహర్షి ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతోంది. నంజున్ దేశ్వరుడు.. కన్నడ భాషలో నంజ అంటే విషం. నజుంద అంటే తాను విషం తాగి లోకాన్ని రక్షించినవాడు అని అర్థం. క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని సేవించి లోకాలను కాపాడిన నీలకంఠుడే ఇక్కడ కొలువయ్యాడని చెబుతుంటారు.
కపిల నదీ తీరంలో ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు.. నదీస్నానం చేసి ఆలయంలో ఉరుల్ అనే సేవ చేస్తే సకల రోగాలు నయమవుతాయని నమ్మకం. పూర్వకాలంలో టిప్పుసుల్తాన్ కు చెందిన పట్టపుటేనుగుకి నేత్ర సంబంధిత వ్యాధి వచ్చినపుడు సుల్తాన్.. ఈ క్షేత్రంలో పూజలు చేయించాక నయమైందట. అప్పుడు సంతోషపడిన టిప్పు సుల్తాన్ స్వామి వారికి పచ్చల పతకం, పచ్చల కిరీటం చేయించాడంట.
అలాగే పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకా దేవి శిరస్సును ఖండించిన తర్వాత తీవ్ర మనోవేదనకు గురై ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉండిపోయాడంట. అందుకే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా పరశురాముని ఆలయాన్ని దర్శించి.. ఆ తర్వాత శ్రీ కంఠేశ్వరుడిని దర్శించుకుంటారు. శివుడు, పార్వతి, గణపతి, కార్తికేయుడు, చండికేశ్వరుడిని ఒక్కొక్క రథంలో ఉంచి.. ప్రతిఏటా జరిగే బ్రహ్మోత్సవంలో ఊరేగిస్తారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. 1735లో ఆలయం పక్కనే ఉన్న కపిల నదిపై కట్టిన వంతెన ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అంతేకాదు.. ఈ ఆలయ పరిసరాల్లోనే లభించే నంజన్ గుడ్ రసభాలే అనే అరటిపండు చాలా రుచిగా ఉంటుంది.