Pitru Dosh Causes : తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలం.. వాళ్ళ వంశంలోని తరతరాలకూ అందుతుంది.
మన పెద్దలు పుణ్యాలు చేస్తూ ఉంటే.. వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
మన పూర్వీకులు పాపాలు చేసి ఉంటే.. వారి వంశం బాధలు, కష్టాలతో ఉంటుంది.
మనలో చాలామంది తెలిసి ఏ తప్పు చేయలేదు.. కానీ బాధలను అనుభవిస్తున్నారు.. అలాంటివారు ముఖ్యంగా తెలుసుకోవలసి విషయం ఒకటి ఉంది. అదే.. ” పితృ దోషం “
ఏటా భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. 15 రోజుల పాటు పితృ పక్షాలను జరుపుకుంటారు. ఈసారి పితృ పక్షాలు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14 వరకు జరుగుతాయి. ఆ టైంలో చనిపోయిన మన పూర్వీకులను తలచుకుంటూ తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్దం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఏదో ఒక రూపంలో పూర్వీకులు కిందకు వచ్చి తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు. అయితే ఈ సమయంలో కొందరు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి వల్ల పితృ దోషాలు వెంటాడతాయి..
పితృ దోషం(Pitru Dosh Causes) అంటే ?
పితృ పక్షాల సమయంలో పూజలు చేసే వారు పితృ దోషాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత వారికి సరైన విధంగా దహన సంస్కారాలు నిర్వహించకపోతే.. అతడి అనేక తరాల వారు పితృ దోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది. పూర్వీకుల అంత్యక్రియలు, శ్రాద్ధాలను సక్రమంగా నిర్వహించకపోవడం.. పూర్వీకులను అవమానించడం.. ఇంట్లోని మహిళలను అవమానించడం.. జంతువులను వధించడం.. పెద్దలను గౌరవించకపోవడం వంటి అనేక కారణాల వల్ల పితృ దోషం వస్తుంది.
Also read : Garuda Puranam: లక్ష్మీ కటాక్షం కావాలా? గరుడ పురాణంలో ఏం చెప్పారో తెలుసుకోండి
పితృ దోషం నుంచి విముక్తికి..
- పితృ దోషం ఉండే వారు భాద్రపద అమావాస్య రోజున నల్లని నువ్వులు, తెల్లని చందనం, తెల్లని పువ్వులు నీటిలో వేసి రావి చెట్టుకు సమర్పించాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ‘ఓం సర్వ పితృ దేవాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది.
- పితృ పక్షాల సమయంలో బ్రాహ్మణులకు కొత్త బట్టలు, ఆహార వస్తువులు దానంగా ఇవ్వాలి.
- మీ పూర్వీకుల ఫొటోను దక్షిణ దిశలో ఉండే గోడలపై తగిలించాలి. వాటికి పూల హారం వేసి వారిని స్మరించుకోవాలి.
- పితృ పక్షాల సమయంలో నాగ స్తోత్రం, పితృ కవచం, మహా మృత్యుంజయ మంత్రం లేదా రుద్ర సూక్తం లేదా పితృ స్తోత్రం, నవ గ్రహ స్తోత్రాలను పఠించాలి.
- పితృ పక్షాల సమయంలో శ్రాద్ధం చేసే వారు గోర్లు, వెంట్రుకలు తీయకూడదు. షేవింగ్ చేసుకోకూడదు.
- శ్రాద్ధం చేసే వారు భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు.
- పితృ పక్షాల సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించొద్దు. కొత్త వస్తువులు, కొత్త వాహనం వంటివి కొనొద్దు.
పితృ దోషం లక్షణాలివే..
- పూర్వీకులకు మనపై కోపంగా ఉన్నా కారణం లేకుండానే ఇంట్లో గొడవలు వస్తాయి.మీకు కూడా ఇలా జరుగుతుంటే.. దీనికి కారణం పితృ దోషమే కావచ్చు.
- పూర్వీకుల కోపం వల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో ఎవరో ఒకరు నిరంతరం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు.
- మీరు ఏదైనా పని చేయాలని తలపెడితే అది సగంలోనే ఆగిపోయినా లేదా పనిలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు కనిపించినా అది పితృదోష లక్షణం కావచ్చు.
- పితృదోషం కారణంగా .. భార్యాభర్తలలో ఎలాంటి సమస్యలు లేకపోయినా సంతానం కలగకుండా ఉంటే అది పితృ దోషానికి సంకేతం.
- మీ కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఎదురైతే, అది పితృ దోషానికి సంకేతం.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.