Site icon HashtagU Telugu

Bhogi Pallu: భోగి పళ్ళు ఏ విధంగా పోయాలి..ఏ వయసు పిల్లలకు పోయాలో తెలుసా?

Bhogi Pallu

Bhogi Pallu

రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ భోగి పండుగ రోజున ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువులను బయట వేసి భోగి మంటను వేస్తారు. ఆ తర్వాత రేగి పళ్ళతో స్నానం చేస్తుంటారు. వీటిని భోగి పళ్ళు అని కూడా అంటారు. భోగి పళ్లని బద్రీఫలం అని కూడా పిలుస్తారు. శివుడిని పసన్నం చేసుకునేందుకు నారాయణుడు బద్రీకవనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నరాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు.

ఈ పండ్లతో అభిషేకం చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అప్పటి నుంచి ఈ రేగిపండ్లు భోగిపండ్లలా మారిపోయాయి. ఇదంతా కూడా భోగిరోజు జరిగింది. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగిపండ్లు పోసే అనవాయితీ ఉంది. అయితే పిల్లలకు భోగిపండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహం లేదా పటాన్ని అలంకరిస్తారు. మొదటగా సరైన మోతాదులో భోగిపండ్లను తెచ్చుకోవాలి. 3 నుంచి 4 గంటల ముందే శనగలను నానబెట్టాలి. ఆ రెండింటిని కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణెలు కూడా అందులో వేయాలి. చెఱకు లేదా పటికబెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపివేయాలి. చివరగా అక్షితలు కూడా తయారు చేసుకోవాలి. పిల్లలకు భోగిపండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగిపండ్లతో అభిషేకం చేయాలి.

3 సార్లు సవ్యదిశ, అలాగే అపసవ్యదిశలో చుట్టి అభిషేకం చేసినట్లు పోయాలి. అలాగే స్వామివారికి పాలు కూడా నివేదించాలి. ఈ భోగిపండ్లు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం 5 లోపు పోయాలి. ముందుగా మీ పాప లేదా బాబును చక్కగా స్నానం చేయించి, రెడీ చేయాలి. ఆ తర్వాత తూర్పు ముఖంగా పీఠమీద కూర్చోబెట్టాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం, కుంకుమ పెట్టి చేతినిండా భోగిపండ్లు తీసుకుని 3 సార్లు సవ్యదిశ, అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి పోయాలి. ఆ తర్వాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఈ భోగి పండ్లను 11 ఏళ్ల వయస్సు వరకు పోస్తారు. మొదటిసారి పిల్లలకు భోగిపండ్లను పోస్తున్నట్లయితే, వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట.