Site icon HashtagU Telugu

Kushmanda Deepam: నరదృష్టిని పోగొట్టే కూష్మాండ దీపం.. ఇలా వెలిగించాల్సిందే!

Kushmanda Deepam

Kushmanda Deepam

భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క రకమైన దీపారాధన ఒక్కో ఫలితాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించి నిమ్మకాయ దీపం, కార్థిక మాసంలో వెలిగించే నారికేల దీపం ఉసిరిక దీపం వంటివి ఈ కోవకు చెందినవే అని చెబుతున్నారు. అటువంటి వాటిలో కూష్మాండ దీపం కూడా ఒకటి అని చెబుతున్నారు. మరి కూష్మాండ దీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది.

ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగక పోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్న వారు కాల భైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చట. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చట. అయితే ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే కాదు. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి, లోపల ఏమి లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి.

తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి. దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి. కాగా కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని, మనసులోని కోరిక విన్నవించి, ఉదయం 4:30 నుంచి 6:00 మధ్యలో చెయ్యాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునే వారు ధనయోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునే వారు అమావాస్య రోజు చెయ్యాలి. మొత్తానికి 19 అష్టములు కానీ, 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలట. నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తిశ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జనాకర్షణ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Exit mobile version