Site icon HashtagU Telugu

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు ఆ జానకి,రాముడిని ఈ విధంగా పూజిస్తే చాలు.. అష్టైశ్వర్యాలు కలగడం ఖాయం!

Sri Rama Navami

Sri Rama Navami

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు శ్రీరామనవమి పండుగ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా ఈ శ్రీరామనవమి పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. శ్రీరాముని జన్మదినం సందర్భంగా ఈ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈరోజున ఆ సీతారాములకు కళ్యాణం జరిపించి అంగరంగ వైభవంగా పూజలు కూడా చేస్తుంటారు. అలాగే సాయంత్రం వేళల్లో పట్టణాలనే తేడా లేకుండా అంతటా శోభాయాత్రలను చేస్తారు. ఏటా వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ఏప్రిల్‌ 6వ తేదీ ఆదివారం రోజున జరుపుకోనున్నారు.

శ్రీ మహా విష్ణువు త్రేతా యుగంలో ధర్మ స్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర మాస శుక్లపక్ష నవమి శ్రీరామనవమి అని పండితులు అంటున్నారు. మరి ఈ పర్వదినాన ఆ జానకీ, రాముడి ఆశీస్సులు పొందడానికి ఇంట్లో ఏ విధంగా పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేవాలట. ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేయాలట. అలాగే కొత్త బట్టలను ధరించి, ఇంటిని మామిడి ఆకుల తోరణాలతో అలంకరించాలట. ఇంట్లో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలని చెబుతున్నారు. తర్వాత ఆ శ్రీరాముడికి శ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో పూజలు చేయాలని చెబుతున్నారు.

తరువాత రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలట. ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల విష్ణలోక ప్రాప్తికలుగుతుందని చెబుతున్నారు. ఈ రోజున ఆ రాముడి ఆశీస్సులు పొందడానికి రామ నామస్మరణం చేయాలని, రామకోటి రాయాలని చెబుతున్నారు. దివ్యమైన ఈ రోజున ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పండితులు చెబుతున్నారు. శ్రీరామ నవమి రోజున రామనామస్మరణ చేయడం, రామనామ ధ్యానం చేయడం వల్ల పాపాలు తొలగి, జయాలు సిద్ధిస్తాయట. ఇంట్లో పూజలు చేయని వారు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి ఉదయాన్నే శ్రీరాముడిని దర్శించుకోవాలట. అలాగే ఆలయాల్లో జరిగే పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం వంటి కార్యక్రమాలలో పాల్గొంటే కూడా పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.