Site icon HashtagU Telugu

Spirtual: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి!

Spirtual

Spirtual

హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇలా దీపారాధన చేసే సమయంలో చాలామంది చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం అసలు దక్కదు అని చెబుతున్నారు పండితులు. అలాగే చాలామందికి నైవేద్యం సమర్పించే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. వాటిని ఎవరిని అడగలేక చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తూ ఉంటారు. మరి దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఎప్పుడూ కూడా వెండి లేదా బంగారం లేదంటే రాగి పాత్రల్లో మాత్రమే సమర్పించాలని చెబుతున్నారు.

అలా కాకుండా ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ వంటి వాటిలో నైవేద్యాన్ని సమర్పించకూడదట. అదేవిధంగా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఎప్పుడూ కూడా పొగలు కక్కుతూ వేడిగా అసలు ఉండకూడదట. వేడిగా ఉన్నప్పుడు పెడితే మహా పాపం అని చెబుతున్నారు. అలాగే ప్రసాదం చాలా ముందుగా చేస్తే అవి చల్లారిపోతాయి. వాటిని కూడా అసలు సమర్పించకూడదట. కాబట్టి నైవేద్యాలను అప్పటికప్పుడు తయారు చేసుకుని గోరువెచ్చగా ఉన్న సమయంలో సమర్పించడం మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడూ మధ్యలో నీళ్ళు చల్లుతూ ఉండాలి. నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదట.

అలాగే నిలవ ఉన్నవీ, పులిసి పోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావట. అలాగే ప్రసాదాన్ని ఎవరైతే చేసి ఉంటారో వాళ్లు మాత్రమే సమర్పించాలని ఒకవేళ అలా సమర్పించలేక పోయిన క్షణంలో దేవుడికి ఆ విషయాన్ని చెప్పుకోవాలని చెబుతున్నారు. ఇక దేవుడికి ఎవరైతే నైవేద్యం పెడతారో వారే హారతి ఇవ్వాలట. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు దేవుడు గది నుంచి బయటికి వచ్చేయాలని, అప్పుడే ఆ దేవుడి చూపు నైవేద్యంపై పడుతుందని చెబుతున్నారు. అనంతరం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇతరులకు పంచడం మంచిదని పండితులు చెబుతున్నారు.

Exit mobile version