Site icon HashtagU Telugu

Pradakshanas: ఆలయంలో ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మీకు తెలుసా?

Pradakshanas

Pradakshanas

మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు మరికొందరు 11 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు వారు మొక్కుకున్న మొక్కు ప్రకారం 101 లేదా 108 ప్రదక్షిణల వరకు చేస్తూ ఉంటారు. అయితే వేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో తమలో తమోగుణాన్ని వదిలేయాలి. రెండో ప్రదక్షిణలో రజో గుణాన్ని వదిలేయాలి. ఇక మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలియాలి. మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దేవాయలం లోకి వెళ్ళి దేవుళ్లను దర్శించుకోవాలి. ఇకపోతే ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అన్న విషయానికి వస్తే..

సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరి. నవగ్రహాలకు కనీసం మూడు. దోషాలు పోవాలంటే తొమ్మిది చేయాలి, ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆంజనేయుడి ఆలయంలో మూడు. గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9 లేదా 11, భయం, రోగం, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21 నుంచి 40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. ముఖ్యంగా శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు. చండీశ్వర ప్రదక్షిణ చేయాలి. అమ్మవారి దేవాలయంలో కనీసం మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

అలాగే వేంకటేశ్వరస్వామి, బాబా, గణపతి దేవాలయాల్లో కనీసం 3,5,9,11 ప్రదక్షిణలు చేయాలి. మంచి వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఎప్పుడు కూడా ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగంగా, పరుగు పరుగున అదో పనిలా ప్రదక్షిణ చేయకూడదు. పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకుని ప్రదక్షిణలు చేయరాదు. ఎన్ని ప్రదక్షిణలు చేసినా మనస్సు స్వామి, లేదా అమ్మవారి పై లగ్నం చేయాలి.