Site icon HashtagU Telugu

Nagula Chavithi: నాగులచవితి రోజు పుట్టలో పాలు పోసే ముందు ఏం చేయాలో మీకు తెలుసా?

Nagula Chavithi (2)

Nagula Chavithi (2)

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో నాగుల చవితి కూడా ఒకటి. ఈ నాగుల చవితి పండుగ రోజున నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పుట్టకు పాలు పోసి చలివిడి వంటివి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. నాగ దేవతను ఆరాధించడంతోపాటు కష్టాల నుంచి గట్టెక్కించమని కోరుకుంటూ ఉంటారు. అయితే నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం మంచిదే కానీ పాలు పోసే ముందు కొన్ని రకాల విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో పూజ గదిని శుభ్రపరిచి దేవుళ్లకు పూజ చేసి తర్వాత నైవేద్యాలను తయారు చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్తారు. ఇక అప్పుడు పాలతో పాటు పండ్లు ఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు కూడా పుట్టలో వేస్తారు. ఈ పండుగను స్త్రీలు ఉపవాసంతో ఉండి నిర్వహిస్తారు. ఈ పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమ చల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత పుట్టలో నైవేద్యం విడిచి, నాగదేవతకు స్మరించుకోవాలి.

అయితే నాగ దోషం ఉన్నవారు నాగుల చవితి రోజు తప్పకుండా పుట్టలో పాలు పోయాలని చెబుతున్నారు. అలాగే నాగ దోషం పోవడానికి నాగదేవతను ప్రత్యేకంగా పూజించాలని చెబుతున్నారు. అయితే పుట్టలో పాలు పోసే ముందుగా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని 9 నాగుపాముల పేర్లూ చెప్పి పుట్టలో పాలు వేయాలట. ఇంతకీ ఆ పేర్లు ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఓమ్ అనంత నాగాయ నమః,  ఓమ్ శేష నాగాయ నమః, ఓమ్ వాసుకి నాగాయ నమః, ఓమ్ తక్షక నాగాయ నమః, ఓమ్ కులుకి నాగాయ నమః, ఓమ్ కర్కోటక నాగాయ నమః,  ఓమ్ శంఖ పాల నాగాయ నమః, ఓమ్ పద్మనాభాయ నమః, ఓమ్ మహపద్మ నాబాయ నమః అనే తొమ్మిది పేర్లను పలికిన తర్వాత పుట్టలో పాలు పోయాలని ఇలా చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు..