Site icon HashtagU Telugu

Hindu Marriage System: పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Hindu Marriage System

Hindu Marriage System

భారతదేశంలో ఇప్పటికీ హిందువులు పూర్వం పెద్దలు పాటించిన ఎన్నో రకాల విషయాలను పాటిస్తూనే ఉన్నారు. ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నో రకాల నియమాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. పూర్వం పెద్దలు పాటించిన వాటిలో తప్పకుండా సైన్స్ దాగి ఉంది అని చాలామంది విశ్వసిస్తున్నారు. అటువంటి వాటిలో హిందువులు పెళ్లిళ్ల విషయంలో ఎన్నో రకాల విషయాలను పాటిస్తూ ఉంటారు. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో అమ్మాయిలు అబ్బాయిలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ లలో మాట్లాడుకుంటున్నారు.

చాలామంది ఎంగేజ్మెంట్ కూడా జరగక ముందు నుంచి మాట్లాడుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ఒకప్పుడు మాత్రం పెళ్లిచూపులో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకరినొకరు చూసుకుంటే ఆ తర్వాత కల్యాణ మండపంలో చూసుకునేవారు. ఇంకా చెప్పాలి అంటే జీలకర్ర బెల్లం పెట్టే వరకు ఒకరినొకరు చూసుకోరు. అందుకే ఇప్పటికీ కూడా జీలకర్ర బెల్లం పెట్టి అంతవరకు కూడా పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఒకరినొకరు చూసుకోకుండా ఉండడం కోసం అడ్డుగా తెర పట్టుకుని నిల్చుంటారు. ఇంతకీ జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి అన్నది చాలామందికి తెలియదు. మరి పెళ్లిలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారు వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కళ్యాణ మండపంలోకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఎదురు ఎదురుగా కూర్చోబెట్టి ఇద్దరి మధ్యా తెరపట్టుకుని నిల్చుంటారు. ఒకరి తలమీద మరొకరు జీలకర్ర బెల్లంపెట్టిన తర్వాతే వారి మధ్య ఉన్న తెరని తొలగిస్తారు. అప్పుడు వెంటనే ఇద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు. ఆ సమయంలో వధూవరుల స్పర్శ, చూపు రెండూ కూడా శుభ్రప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టారు పెద్దలు. జీలకర్ర, బెల్లం రెండింటికీ వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. బెల్లం ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండానే అంటిపెట్టుకుని ఉన్న పదార్తానికి సద్గుణాలను అందిస్తుంది. వివాహబంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే, ఎవరి అస్తితత్వాన్ని వారు నిలుపుకోవాలనీ తనలో సద్గుణాలని ఎదుటివారికి అందించాలనీ ఈ రెండు పదార్థాల కలయిక వెనుకున్న అర్థం.

కాగా జీలకర్ర, బెల్లం ఈ రెండూ పూర్తి భిన్నమైన పదార్థాలు. కానీ రెండింటినీ కలిపి పుచ్చుకుంటే ఎన్నోరకాల సమస్యలు తీరిపోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. ఒంటికి చలవచేయడం దగ్గర్నుంచీ, రక్తహీనతని తగ్గించడం వరకూ జీలకర్ర, బెల్లం చాలా సమస్యలని పరిష్కరిస్తాయి. భార్య, భర్తా కూడా వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగినవారైనప్పటికీ ఎలాంటి సమస్యనైనా కలిసి ఎదుర్కోవాలన్న సూచన ఇందులో కనిపిస్తుంది. జీలకర్ర, బెల్లం రెండింటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందనీ కొందరు నమ్ముతారు. వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర, బెల్లం పెట్టి ఉంచడంతో, వారిద్దరూ మధ్యా ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుందట. జీలకర్ర, బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు. యోగశాస్త్రం ప్రకారం జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అయితే ఈ జీలకర్ర, బెల్లం పెట్టే ఆచారం హిందూ పెళ్లిళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మన దగ్గర సుముహూర్తం అంటే జీలకర్ర, బెల్లం పెట్టడమే.